జాతిపిత మహాత్మాగాంధీ అరుదైన చిత్రపటానికి అమెరికాలో వేలంపాట  నిర్వహించారు. ఈ ఫోటోలో గాంధీజీతోపాటు  మదన మోహన్ మాలవీయ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తున్నప్పుడు తీసిన ఫోటో అది. కాగా.. ఈ ఫోటో వేలంలో భాగానే ధర పలికింది. ఈ ఫోటోపై మహాత్మాగాంధీ స్వయంగా చేసిన సంతకం కూడా ఉంది. దీంతో.. దీనిని కొనుగోలు  చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. చివరికి ఫోటో 41,806  డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 27లక్షలు పలికింది.

అది 1931 సెప్టెంబరులో లండన్‌లో రెండో సెషన్‌ భారత‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం అనంతరం తీసిన ఫొటో అని బోస్టన్‌కు చెందిన ఆర్‌ ఆర్‌ వేలం సంస్థ వెల్లడించింది.  భారత నేషనల్‌ కాంగ్రెస్‌ తరఫున గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. లండన్‌లో 1930 నుంచి 1932 మధ్య బ్రిటన్‌ మూడు సార్లు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించింది.

గాంధీ ఈ ఫొటోపై సంతకం చేసిన సమయంలో కుడి చేతి బొటనవేలులో నొప్పితో బాధపడుతున్నారని వేలం సంస్థ తెలిపింది. ఆయన 1931లో ఆగస్టు 8 నుంచి డిసెంబరు 19 వరకు ఎడమ చేతితోనే రాశారని.. ఆ సమయంలోనే ఈ ఫొటోపై సంతకం చేశారని వేలం సంస్థ తెలిపింది.