2019 లోకసభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందా అనే విషయంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టత ఇవ్వలేదు. 

చెన్నై: 2019 లోకసభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందా అనే విషయంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టత ఇవ్వలేదు. కర్ణాటక రాజకీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. 

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహసించాలని చూసిందని, అయితే చివరకు న్యాయమే గెలిచిందని రజనీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాలు సంభవించాయని, ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి గవర్నర్‌ ఏకంగా 15 రోజుల సమయం ఇచ్చారని అన్నారు. 

న్యాయస్థానం జోక్యం చేసుకోవటంతో పరిస్థితులు మారిపోయాయని అన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు హర్షించదగిందని అన్నారు. ఎట్టకేలకు ప్రజాస్వామ్యం వర్థిల్లిందని, కర్ణాటకలో జరిగిన విషయాన్ని పాలకులందరూ గమనించాలని అన్నారు.

లోకసభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని, ఎన్నికల తేదీలు ప్రకటించినప్పుడు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇంకా పార్టీని ప్రకటించలేదు కదా అని అన్నారు. అయినా అన్నింటికి మేం సిద్ధంగా ఉన్నామని, ఇక పొత్తుల గురించి ఇప్పుడే మాట్లడటం సరికాని అన్నారు. 

పార్టీ ప్రకటించలేదు కాబట్టే కమల్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేకపోయానని చెప్పారు. భవిష్యత్తులో మాత్రం సమావేశాలకు తప్పకుండా హాజరవుతానని అన్నారు.