హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం ప.గో, తూ.గో జిల్లాల్లో వర్షాలతో నిండిన చెరువులు. తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం పడుతోంది. యూసఫ్‌గూడ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాలతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో వాన కురుస్తోంది. దీనితో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా జూబ్లీ చెక్ పోస్ట్, ఖైరతాబాద్ జంక్షన్లు ట్రాఫిక్ జామ్ వాహానాలు ఎక్కడి అక్కడే నిలిచిపోయాయి.
ఇక ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలు, కడప, నెల్లూరు, ప్రకాషం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప.గో.లోని భీమవరం, ఉండి, కాళ్ల పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. తూ.గో జిల్లా మండపేటలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. జిల్లాలోని బోగోలు మండలం జువ్వలదిన్నెలో పిడుగుపాటుకు 12 మేకలు మృతి చెందాయి. మార్కాపురం లో కూడా భారీ వర్షాలు పడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
