మహిళల కోసం ప్రత్యేకంగా రైల్వేస్టేషన్లలో శానిటరీ నాప్ కిన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని 200 రైల్వే స్టేషన్లలో శానిటరీ నాప్ కిన్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

సోమవారం పీయూష్ గోయల్..సరోజినీ నగర్ రైల్వే కాలనీలోని శానిటరీ ప్యాడ్స్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రం మహిళా సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద మహిళలకు, రైల్వే మహిళా ఉద్యోగినులకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా పంచిపెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికే న్యూఢిల్లీ,భోపాల్ రైల్వేస్టేషన్లతోపాటు బరోడా హౌస్ రైల్వేకార్యాలయంలో శానిటరీ ప్యాడ్స్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. స్టెరిలైజ్ చేసిన నాప్ కిన్స్ ను మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు