ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని తొలిసారి కాంగ్రెస్ ఆరోపణ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పెద్ద ఛాలెంజే విసిరారు.

నోట్ల రద్దు తర్వాత ప్రధాని పార్లమెంటు ముఖం చాటేస్తూ ఉండటం రాహుల్ కు కొండంత ధైర్యం ఇచ్చింది.

అందుకే ఈ రోజు ప్రధాని మీద నిప్పులు చెరిగారు. ‘మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారం నా వద్ద ఉంది. ఆ సమాచారాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనివ్వకుండా నన్ను అడ్డుకుంటున్నారు. అందుకే మీ ముందుకు వచ్చాను,’ అని పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఒక ఆరోపణ చేయడం ఇదే మొదటి సారి.

అయితే, తనదగ్గిర ఉన్న సమాచారమేమిటో ఆయన వెల్లడిండచలేదు. ‘ నా దగ్గిర ప్రధాని వ్యక్తిగత అవినీతికి సంబంధించిన కొంత సమచారం ఉంది. లోక్ సభలో మాట్లాడే అవకాశం రాగానే నేను ఈ విషయం సభ ముందుంచుతాను. మాట్లాడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను,’ అని రాహుల్ చెప్పారు.


ప్రతిపక్షాల డిమాండ్ వల్ల లోక్‌సభ సమావేశం బుధవారం వాయిదా పడిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో కలిసి పార్లమెంటు బయటన విలేకరుల ముందుకువచ్చారు.


‘నోట్ల రద్దు మీద ప్రధాని అబద్ధాలు మాట్లాడుతున్నారు. నోట్లరద్దుపై బేషరతుగా పార్లమెంటులో చర్చకు మేం సిద్ధంగా ఉన్నా, లేచినిలబడి అరుస్తూ సభను అడ్డుకుంటున్నది అధికార పక్షమే. అధికార పక్షం సభను అడ్డుకోవడం దేశ పార్లమెంటు చరిత్రలోనే ఇదే తొలిసారి ,’ అని రాహుల్‌ ఆరోపించారు.