ప్రత్యర్ధిపై పూర్తి ఆధిక్యత కనబరచటం ద్వారా తదుపరి సీరిస్ ల్లో కూడా తనదే ఆధిక్యత అని ప్రత్యర్ధులకు  సింధు చాటిచెప్పినట్లైంది.

దెబ్బకు దెబ్బ. ఒలంపిక్స్ ఫైనల్లో ఓడిన క్రీడాకారిణీతోనే తలపడి పూర్తి ఆధిక్యత సాధించటమంటే మాటలు కాదు. ప్రపంచంలోనే అత్యున్నత క్రీడాకారిణి కరోలినా మారిన్ ను చిత్తుగా ఓడించి ఇండియా సూపర్ సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకుంది భారత ‘సింధూ’రం. ఆదివారం జరిగిన ఆల్ ఇండియా సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తెలుగుతేజం పుసర్ల వెంకట సింధు మెగా టోర్నిలో విశ్వరూపం చూపించింది. మ్యాచ్ మొదలైనప్పటి నుండి ప్రత్యర్ధిపై పూర్తి ఆధిక్యత సాధించి ఘనవిజయం సొంతం చేసుకుంది. సంవత్సరాల తరబడి అందకుండా ఊరిస్తున్న ఈ టైటిల్ ఎట్టకేలకు సింధు చేతిలో పడింది. 

హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచంలోనే మొదటి ర్యాంకులో ఉన్న ప్రత్యర్ధిని 21-19, 21-16 స్కోరుతో ఓడించిందంటేనే ఏ స్ధాయి ఆటను ప్రదర్శించిందో అర్ధమైపోతోంది. 47 నిముషాల పాటు సాగిన ఆటలో మొదటి నుండి సింధు పూర్తి ఆధిక్యతను కనబరచటం విశేషం. ఒక్క పాయింట్ పోయినా మ్యాచ్ పోతుందన్న కసితో సింధు చెలరేగిపోయింది. గతేడాది చైనాలో జరిగిన తొలి సూపర్ సిరీస్ టైటిల్ ను కూడా తన ఖాతాలో వేసుకున్న సింధుకి ఇది రెండో సూపర్ టైటిల్. ఇండియా ఓపెన్ నెగ్గిన మూడో షట్లర్ గా పివి సింధు రికార్డులకు ఎక్కింది.

పోటి మొదలైనప్పటి నుండి కరోలినా ఆత్మరక్షణ విధానంలోనే కొనసాగటం ఆశ్చర్యం. దాంతోపాటు సింధు రెచ్చిపోవటంతో ప్రత్యర్ధిలో కలవరం మొదలైనట్లే కనబడింది. సింధు మొదటినుండి వైవిధ్యమైన షాట్లతో, బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లే కాకుండా స్మాష్, డ్రాప్ షాట్లతో ఆలఓకగా ఆడేసింది. దాంతో మొదటి సెట్ ను కైవసం చేసుకున్న సింధు అదే ఊపుతో రెండో సెట్ లో కూడా పూర్తి ఆధిక్యతను కనబరచింది. దాంతో ప్రత్యర్ధి చేతులెత్తేసింది. మొదటి సెట్లో తొలుత వెనుకబడినా వెంటనే పుంజుకుని ప్రత్యర్ధిపై ఆధిక్యత సాధించింది. అక్కడి నుండి మరి వెనక్కు చూసుకోలేదు. ఆట మొత్తం మీద సింధు కళ్ళు చెదిరే షాట్లు, స్మాష్ లు, బ్యాక్ హ్యాండ్ స్ట్రోక్ లతో ప్రత్యర్ధిని బాగా ఇబ్బంది పెట్టింది. గేమ్ మొదలుపెట్టింది మొదలు ప్రత్యర్ధిపై పూర్తి ఆధిక్యత కనబరచటం ద్వారా తదుపరి సీరిస్ ల్లో కూడా తనదే ఆధిక్యత అని ప్రత్యర్ధులకు సింధు చాటిచెప్పినట్లైంది.