బాబొస్తే జాబొస్తుందనే చంద్రబాబు నాయుడి 2014 ఎన్నికల స్లోగన్ ని పంజాబ్ కాంగ్రెస్ విన్నింగ్ ఫార్ములా అనుకుంటూన్నది
గెల్చిన తర్వాత ఏలా నెరవేస్తామన్నది కాదు, ఎన్నికల్లో గెలిచేందుకు ఏ హామీ నయినా ఇవ్వొచ్చనేది లౌక్యం. గెల్చాక హామీ లను నెరవేర్చాలన్న గ్యారంటీ లేదు. హామీ లేంచేశావో చెప్పు అని ఎవరో అపోజిషనోళ్ల తప్ప, ప్రజలెపుడు రాళ్లు పట్టుకుని వెంటపడి ప్రభుత్వాన్ని నిలదీయరు.
అధికారంలోకి వచ్చాక కాకి లెక్కలు కోటి చెప్పి, 98 పర్సెంట్ హామీలు నెరవర్చామని, మిగతా రెండు శాతం కొంచెం ఆర్ధిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నామని ‘నిజాయితీ’గా ప్రకటించవచ్చు.
అప్పటికీ నమ్మక పోతే, యాప్ ఒకటి క్రియేట్ చేసి, ఏ సమాధానం చెప్పినా మనకే సపోర్టొచ్చేలా తెలివిగా ప్రశ్నలువేసి సర్వే చేయించవచ్చు.అదీకాకపోతే, మనవాళ్లు నడిపే పత్రికలతోసర్వే చేయించేవచ్చు. అందువల్ల ఎన్నికల పుడు ఎలాంటి వాగ్దానాలు చేసినా పాపం కాదు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాబొస్తే జాబొస్తుందనే స్లోగన్ ఇచ్చారు. దాన్ని ఇంకా విశదంగా, అందరికి అర్థమయ్యేలా ఇంటింటికొక ఉద్యోగం మిస్తామని చెబుతూ హామీ ఇచ్చారు.
అనుమానపు పక్షులెవరయిన అన్ని ఉద్యోగాలెక్కడున్నాయని అడిగితే, ఉద్యోగం వచ్చేదాకా కుటుంబానికి రు. 2000 నెలసరి నిరద్యోగ భృతి ఇస్తామని అన్నారు. దీనితో నోరు మూసుకుని వోటేసి గెలిపించారు.
ఇపుడేమో కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ వాళ్లు ఇదంతామోసం, ఫౌల్ అని అరుస్తున్నారు. రెండున్నరేళ్లయింది ఉద్యోగాలెక్కడ, నిరుద్యోగ భృతి ఏది అని గోల చేస్తున్నారు. దీని మీద జగన్ యువభేరి మోగిస్తూ ఊరూర తిరిగి, విద్యార్థి యువజనులను కూడ దీస్తున్నారు. కాంగ్రెస్ కూడా అలుపెరగని పోరాటం చేస్తూ ఉంది. ఇది వేరే విషయం.
ఇలాంటపుడు పంజాబ్ కాంగ్రెస్ వాళ్లు తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడే తమకు అదర్శం అంటున్నారు. టిడిపి దగ్గిర విన్నింగ్ ఫార్ములా ఉన్నట్లు వాళ్లు పసిగట్టారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ప్రయోగించిన ‘ఇంటింటికీ ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ’ అని హామీని పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చారు.
తెలుగుదేశం హామీని మక్కీకి మక్కి కాపీ కొట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిలాగా, అక్కడి పిసిసి అధ్యక్షుడు అమరిందర్ సింగ్ 2017 ఎన్నికలను గెలిచి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, పంజాబ్ లో ప్రతిఇంటికొక ఉద్యోగమిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్ ప్రకటించారు.
పదిపాసయి ఉంటే చాలు 18 నుంచి 35 సంవత్సరాలుండే యువకులందరికి ఇంటికొకరికి చొప్పున ఉద్యోగమిస్తామని పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రకటించారు. ఉద్యోగం ఇప్పించే వరకు నెలకు రు.2500 చొప్పున ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 36 నెలల పాటు ఇలా నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా ఆయన చెప్పారు.
ఇది ఆచరణలో అసాధ్యం కాదని కూడా ఆయన చెబుతున్నారు. ఈ పథకం అమలు చేస్తే బడ్జెట్ కేటాయింపులు 2 శాతం మించవని, అందువల్ల ఫథకం అంత భారం కాదని ఆయన సమర్థించుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 50 లక్షల స్మార్ట్ ఫోన్లను ఇంటింటికి అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.
వచ్చే జనవరిలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.
