అమరవీరుల స్ఫూర్తి యాత్రను అడ్డుకునేందు ఈ  అరెస్టు అంటున్న టిజాక్

అమర వీరుల స్పూర్తి యాత్రకు జనగామ బయలుదేరిన జేఏసీనేత ప్రొఫెసర్ కోదండరామ్ ను నారాపల్లి వద్ద తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. కోదండరాం తో సహా అనేక మంది ఇతర నేతలను కూడా అరెస్టు చేసి ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెల్తున్నారు. ఈ యాత్ర ఈ రోజు వరంగల్ నుంచి ప్రారంభమయింది. అయితే, అర్థరాత్రి నుంచే అరెస్టులు మొదలయ్యాయి.

మొదట ఈ ఆరవ దశ స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడానికి టీజేఏసీ వరంగల్, జనగామ,మహబూబాబాద్ నాయకులను, కార్యకర్తలను, విద్యార్థి నాయకులను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. అరెస్టులింకా కొనసాగుతున్నాయి. ఇదే విధంగా జనగాం లో పోలీసులు దగ్గరుండి జెఎసి జండాలను తీసేయించారు. ఈ అరెస్టులను టీజేఏసీ తీవ్రంగా ఖండించింది. అరెస్టులతో తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అడ్డుకోలేరని తక్షణం అరెస్టులు ఆపాలని కోదండ రామ్ కోరారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు.. అరెస్టయిన వారిలో సోషల్ మీడియా నాని, శ్రీను, బాల లక్ష్మి (ఉస్మానియా) సారయ్య, ప్రశాంత్( కాకతీయ)లు ఉన్నారు. మానుకోట జిల్లా జేఏసీ నేతల అక్రమ అరెస్ట్ ను వరంగల్ జెఎసి తీవ్రంగా ఖండించింది. కెసిఆర్ ప్రభుత్వానికి జేఏసీ అంటే భయం పట్టుకుందని అందుకే ఈ అరెస్టులని వరంగల్ జిల్లా టిజాక్ కన్వీనర్ బొనగాని రవీందర్ అన్నారు.‘కోదండరాం మాటలు ప్రజలకు సూటిగా చేరుతున్నాయి. ఇది తెలుకున్న ప్రభుత్వం పోరు గడ్డపై కోదండరామ్ యాత్ర కు బ్రేక్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. అందులో భాగమే అరెస్టులు,’ అని ఆయన అన్నారు.