ప్రతిపక్షాల వత్తడితో చివరకు ఆరో రోజున లోక్ సభలో ప్రత్యక్షమయిన ప్రధాని మోదీ

మొత్తానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బుధవారం నాడు పార్ల‌మెంట్‌లో కాలుపెట్టారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాక ఒకే ఒక్క సారి ప్రధాని చుట్టం చూపుగానే పార్లమెంటు కొచ్చారు.

మొదట్లో ఒకసారొచ్చి అందరకి ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. నోట్ల వ్యవహారం మీద ఇంత పెద్ద రభస జరుగుతున్నా ఆయన పార్లమెంటుకు హాజరుకాకుండా బయట అనేక ప్రయివేటు, పార్టీ కార్యక్ర మాలలో పాల్గొని పెద్ద నోట్ల రద్దు మీద తన వాదనను వినిపిస్తూ వస్తున్నారు. ఇది ప్రతిపక్షాలకు నచ్చడం లేదు.

ప్రధాని మోదీ సభకు రావాలని, నోట్ల రద్దు మీద ప్రతిపక్ష సభ్యులు లేవదీస్తున్న అంశాల మీద, దేశ వ్యాపితంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్ల మీద సమాధానం చెప్పాలని ఉభయ సభలలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు అంటే ప్రధాని ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ, బిఎస్ పి నేత మాయావతి అడుగుతున్నారు.

పార్లమెంటును ప్రధాని విస్మరించడం పట్ల మేధావులు, సోషల మీడియా యాక్టివిస్టులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని ఈ రోజు లోక్ సభలో ప్రత్యక్షమయ్యారు. నోట్ల విపత్తు అయిదు రోజులుగా పార్లమెంటును కుదిపేస్తున్నపుడు ప్రధాని సభకు రావడం కొంచెం వూరట కల్పించినా ఆయనకు మాట్లాడే అవకాశం రాలేదు.

నోట్ల ర‌ద్దు అంశంపై చ‌ర్చ నిర్వ‌హించాల‌ని, ప్ర‌ధాని స‌భ‌లో ఉన్నపుడే ఈ చర్చ సాగాలని లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, లోక్ స‌భ ప్రారంభ‌మైన కొన్ని క్ష‌ణాల‌కే నోట్ల ర‌ద్దు సమస్య పెట్రేగి సభ వాయిదాకు దారితీసింది. ప్ర‌ధాని మోదీ కేవ‌లం స‌భ‌కు వ‌స్తే స‌రిపోద‌ని, ఆయ‌న ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్ డిమాండ్ చేశారు.

పార్లమెంటు అంటే ప్రధాని ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ, బిఎస్ పి నేత మాయావతి అడుగుతున్నారు. ఈ రోజు పార్లమెంటు బయట పది ప్రతిపక్ష పార్టీలకు చెందిన దాదాపు రెండువందల మంది సభ్యులు నోట్ల రద్దుకు నిరసనగా మానవ హారం నిర్వహించారు.

ప్రధాని సభకొచ్చాక కూడా గొడవ చేసి సభ వాయిదా పడేలా ప్రతిపక్షాలు ప్రవర్తించాయని బిజెపి నేత వెంకయ్య నాయుడు విమర్శిస్తున్నారు. ’ ప్రతిపక్షాలకు సభ నడవడం,సభలో ప్రధాని ఉండటం కాదు ముఖ్యం, ఏదో ఒకసాకుతో అడ్డుకోవడమే వారి లక్ష్యం ,‘ అని నాయుడు అన్నారు.