ఎవ్వరిని ప్రశ్నిస్తున్నారో తెలీకుండా, ఏమని ప్రశ్నించాలో కూడా తెలీకుండా ఏదో ఒక తెల్ల కాగితం పై నాలుగు గీతలు గీకేసి ఇవే ప్రశ్నలని, ప్రభుత్వాలని నిలదీస్తున్నామని చెప్పుకుంటున్న పవన్ది నిజంగా ఆత్మవంచనే. దీక్ష వల్ల జగన్ కు వస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే పవన్ హడావుడిగా లేఖను రాసినట్లుంది చూడబోతే.

ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని, ఎవరినైనా సరే నిలదీస్తామని చెప్పుకునే జనసేన చివరకు నవ్వుల పాలవుతోంది. ఎవ్వరిని ప్రశ్నిస్తున్నారో తెలీకుండా, ఏమని ప్రశ్నించాలో కూడా తెలీకుండా ఏదో ఒక తెల్ల కాగితం పై నాలుగు గీతలు గీకేసి ఇవే ప్రశ్నలని, ప్రభుత్వాలని నిలదీస్తున్నామని చెప్పుకుంటున్న పవన్ది నిజంగా ఆత్మవంచనే.

తెలుగు రాష్ట్రాల్లో పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతాంగం బాగా ఇబ్బందులు పడుతోంది. అదే విషయమై వైసీపీ అధ్యక్షుడు జగన్ రెండు రోజుల పాటు రాజధాని జిల్లా గుంటూరులో దీక్ష చేసారు. చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కడిగిపారేసారు. సరే, జగన్ అడిగిన వెంటనే పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేస్తాయా అన్నది వేరే ప్రశ్న.

రాజకీయ పార్టీ అన్న తర్వాత ప్రజా సమస్యలపై గొంతు విప్పాలి కదా? ప్రభుత్వాలను నిలదీయాలి కదా? జగన్ చేస్తున్నది అదే పని. మరి ప్రశ్నించటానికే పుట్టిన జనసేన పార్టీ గొంతు ఇంకెంత తీవ్రంగా ఉండాలి. కానీ జరుగుతున్నదేమిటి?

జగన్ దీక్ష ముగిసిన రోజే పవన్ కూడా పంటలు, గిట్టుబాటు దరలు, రైంతాంగం సమస్యలంటూ మీడియా మొహాన ఓ లేఖ పడేసారు. అందులో ఏ ప్రభుత్వాన్ని తాను ప్రశ్నించదలచుకున్నది లేదు. కనీసం ముఖ్యమంత్రుల పేర్లు కూడా లేవు. ఏదో గాల్లో ఓ బాణం వేసినట్లుంది. దీక్ష వల్ల జగన్ కు వస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే పవన్ హడావుడిగా లేఖను రాసినట్లుంది చూడబోతే.

నిజానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. అదే విషయాన్ని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి అదే విషయాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. రాసిన లేఖలో ఎక్కడా చంద్రబాబు పోనీ కెసిఆర్ పేరు కూడా ప్రస్తావించలేదే. మోహమాటమొ లేక భయమొ తెలీటం లేదు. పైగా రైతు సమస్యలకు కారణం వ్యవసాయాధికారుల, మార్కెటింగ్ శాఖ వైఫల్యంగా పవన్ చెప్పటం పెద్ద జోక్. ఎందుకంటే, ముఖ్యమంత్రి ఆమోదంతోనే పాలసీలు తయారౌతాయి. వాటిని అమలు చేయటమే అధికారుల పనన్న విషయం కూడా పవన్ కు తెలీదా?

‘పెట్టుబడుల కోసమంటూ విదేశీ కార్పొరేట్ కంపెనీల మీద చూపించే శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై చూపకపోవటం వల్లే రైతులు రోడ్లెక్క వలసిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయం’టూ ఓ సెటైర్ ఒకటి మళ్ళీ.

పెట్టుబడుల కోసమంటూ అమెరికా పర్యటనకు వెళుతున్నది చంద్రబాబే. ఆ విషయం అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయాన్ని కూడా నేరుగా చెప్పటానికి కూడా పవన్ ఎందుకు వెనకాడుతున్నారు? అంటే జనసేన పెట్టింది ప్రశ్నించటానికా లేక ప్యాకేజీల కోసమే అని జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లే పవన్ పోకడలుండటం గమనార్హం.