సిఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో కాంగ్రెస్ గొడవలు పడుతుంటూ మధ్యలో అవకాశాన్ని భాజపా తనుకుపోయింది.

ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిజంగా ఓడిందెవరు? గెలిచిందెదవరు? రాజకీయ పార్టీల వరస చూస్తుంటే ఈ ప్రశ్నవేసుకోక తప్పటం లేదు. ప్రజాస్వామ్యంలో ఏపార్టీ ఎక్కువ స్ధానాలు గెలుచుకుంటే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. యుపి, ఉత్తరాఖండ్, పంజాబ్ లో మాత్రం సక్రమంగానే జరిగింది. మరి, గోవా, మణిపూర్ లో మాత్రం ప్రజాస్వామ్యం తల్లక్రిందులైంది. ఎందుకు? తక్కువ ఎంఎల్ఏలు గెలిచిన భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఏ ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనం.

సహజంగా అయితే, గోవా, మణిపూర్ లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. బలనిరూపణలో విఫలమైతే అప్పుడు రెండో పార్టీ భాజపాకు అవకాశం ఇవ్వటంలో తప్పులేదు. కానీ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మొత్తుకుంటున్నా గవర్నర్ ఏమాత్రం పట్టించుకోలేదు. తెరవెనుక జరిగిన రాజకీయం కారణంగానే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నది వాస్తవం. పై రెండు రాష్ట్రాల్లో ప్రజలు భాజపాను తిరస్కరించారు. అయినా తానే ప్రభుత్వంలో కూర్చుంటామని భాజపా నేతలు నిసిగ్గుగా చెబుతున్నారు.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేతగానితనం కూడా స్పష్టం. అతిపెద్ద పార్టీగా నిలిచినా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్ధానాలు మాత్రం దక్కలేదు. ఇతరులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. దాన్ని భాజపా అవకశంగా మలుచుకున్నది.

ఇటువంటి పరిస్ధితుల్లో తమకు సహకరించే వారిని ముందుగా వెతుక్కోవాల్సిన పార్టీ పూర్తి నిర్లక్ష్యం వహించింది. సిఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో గొడవలు పడుతుంటూ మధ్యలో అవకాశాన్ని భాజపా తనుకుపోయింది. ఎన్సీపీ, స్వతంత్రుల్లో కొందరు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా మద్దతు ఇస్తామని సంకేతాలు పంపినా గోవాలో కాంగ్రెస్ పట్టించుకోలేదట. ఇక, మణిపూర్ లో కూడా అదేవిధంగా కమలం పార్టీ అధికారాన్ని ఎగరేసుకుపోతోంది. ప్రజలు తిరస్కరించినా ప్రభుత్వాన్ని భాజపానే ఏర్పాటు చేస్తుండటమే విచిత్రం. అందుకే ఎన్నికల్లో గెలిచిందెవరు? నిజంగా ఓడిందెవరనే ప్రశ్న తలెత్తుతోంది. గెలిచింది రాజకీయం ఓడింది ప్రజాస్వామ్యం. ఎవరికైనా డౌటా ?