బుధవారం పోలీసులు ఆయనను విచారించారు విక్రమ్ ను విచారించే సమయంలో ఆయన వెంట.. డాక్టర్, వారి కుటుంబసభ్యులు ఒకరు ఉన్నట్లు అధికారులు చెప్పారు
రాజకీయ కాంక్ష కోసమే తాను ఈ హత్యా నాటకం ఆడినట్లు.. విక్రమ్ గౌడ్ తెలిపారు. అనేక పరిణామాల అనంతరం విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటన మిస్టరీ విడిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ .. తనపై తానే కావాలని దాడి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా.. బుధవారం పోలీసులు ఆయనను విచారించారు. ఈ విచారణలో తాను రాజకీయ కాంక్ష కోసమే ఈ ఘటనకు పాల్పడినట్లు చెప్పారు.
కోర్టు ఆదేశాల మేరకు బంజారా హిల్స్ పోలీసులు.. ఈ కేసులో ప్రధాన నిందుతుడైన విక్రమ్ గౌడ్, అతనిపై దాడికి పాల్పడిన నంద కుమార్, షేక్ అహ్మద్, రాయిస్ ఖాన్, బాబుజాన్, గోవింద్ రెడ్డిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా.. విచారణ కోసం వారిని బుధవారం ఉదయం జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ కి తరలించారు. విచారణ అనంతరం తిరిగి జైలుకి పంపించారు.
పోలీసులు విక్రమ్ ను విచారించే సమయంలో ఆయన వెంట.. డాక్టర్, వారి కుటుంబసభ్యులు ఒకరు ఉన్నట్లు అధికారులు చెప్పారు. విచారణలో భాగంగా విక్రమ్ గౌడ్ ని, అతనికి తుపాకీతో కాల్చిన రాయుస్ ఖాన్ ను పోలీసులు.. జూబ్లిహిల్స్ లోని వారి ఇంటికి తీసుకువెళ్లారు. ఘటన సమయంలో అసలు ఏం జరిగిందో వారితో చెప్పించడానికే అక్కడికి తీసుకువెళ్లినట్లు పోలీసులు చెప్పారు.
‘నాకు కొంత ఆర్థిక సమస్యలు ఉన్న మాట నిజమే కానీ.. అది పెద్ద సమస్య కాదు. రాజకీయాల్లో రాణించేందుకే నేను ఇలాంటి ఘటనకు పాల్పడ్డాను’ అని విక్రమ్ పోలీసులకు తెలిపారు.
‘విక్రమ్ సూచనల మేరకు నేను నందు, అహ్మద్ తో కలిసి జులై 28వ తేదీన తెల్లవారుజామున విక్రమ్ గౌడ్ ఇంటికి వెళ్ళాము. విక్రమ్ గౌడ్ తో మాట్లాడిన తర్వాత..నందు అక్కడి నుంచి స్కార్పియోలో వెళ్లిపోయాడు. అహ్మద్ పల్సర్ బైక్ తో ఇంటి బయట వేచిఉన్నాడు. ఆ సమయంలో విక్రమ్ ఆదేశాల మేరకు తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాను. అనంతరం అహ్మద్ తో కలిసి పారిపోయా’ నని రాయిస్ పోలీసుల విచారణలో చెప్పాడు.
విచారణలో వీరు చెప్పిన సమాచారన్నంతటినీ పోలీసులు వీడియోలో రికార్డు చేశారు.
