వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ ముఖ్య మంత్రి కావడమే ధ్యేయంగా నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం తిరుమలకు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

ఆయన అలా పాదయాత్ర చేపట్టారోలేదో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఎమ్మెల్యే పాదయాత్రను అడ్డుకున్నారు. అదే సమయంలో టీడీపీ కార్యర్తల ర్యాలీ ఉందంటూ పోలీసులు హడావిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎమ్మెల్యే పాదయాత్రకు ఆటంకం ఏర్పడింది.

అయితే.. కావాలనే ఎమ్మెల్యే పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని  తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని కోరుకునేందుకు తాను ఈ పాదయాత్ర చేపట్టానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.   ప్రతిపక్ష నేతల విషయంలో ప్రతిసారీ పోలీసులు  ఓవరాక్షన్  చేస్తున్నారు. మొన్న ముద్రగడ పాదయాత్రను కూడా ఇదేవిధంగా అడ్డుకున్నారు. ఆయనను సొంత పనుల కోసం కూడా వెళ్లనీయకుండా చేస్తున్నారు. తాజాగా గోపిరెడ్డి పాదయాత్రను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలువురు ఈ విషయంలో పోలీసులపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.