పవన్.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. ప్రతి సంవత్సరం దీపావళి పండగకు దేశంలోని ఏదో ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లడం ఇతని అలవాటు. ఆ కొత్త ప్రాంతంలో పండగను జరుపుకుంటూ ఉంటాడు. పక్కా ప్రణాళికతో ముందుగానే ట్రావెలింగ్ ఏర్పాట్లు, ఆ ప్రాంతానికి వెళ్లాక అక్కడ హోటల్ రూమ్స్ అనీ ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు. అయితే.. ఈ సంత్సరం  కొన్ని కారణాల వల్ల ఆ విధంగా ప్లాన్ చేసుకోలేక పోయాడు. ఇప్పటికిప్పుడు వెళ్లాలంటే.. పండగ సీజన్ కదా టికెట్లతో పాటు హోటల్ రూమ్ ధరలు కూడా భారీగా ఉన్నాయి. దీంతో నిరుత్సాహానికి గురయ్యాడు. ప్రతి సంవత్సరం ముందుగా ఏర్పాట్లు చేసుకోవడం వల్ల బడ్జెట్ లోనే పర్యటన అయిపోయేది. కానీ.. ఇప్పుడు తన బడ్జెట్ కి డబుల్, త్రిబుల్ ఖర్చు అయ్యేలా ఉంది.

మీది కూడా ఇలాంటి సమస్యేనా. అయితే.. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకపోయినా.. మీ బడ్జెట్ లోనే విహారయాత్రలకు వెళ్లి రావచ్చు. అది కూడా ఈ దీపావళి పండగ సీజన్ లోనే. ఎలా అంటారా.. చదవండి ఇంకెందుకాలస్యం...

స్నేహితులతో...

ప్రతి సారి ఒంటరిగానో, కుటుంబసభ్యులతోనే విహార యాత్రలకు వెళ్లే అలవాటు ఉంటే.. ఈ సారి స్నేహితులతో వెళ్లండి. దీని వల్ల ఖర్చు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. నాలుగురు నుంచి ఎనిమిది మంది వరకు వెళ్లారనుకోండి ట్రావెలింగ్ ఖర్చులతోపాటు, హోటల్ రూమ్ ఖర్చులు కూడా షేర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు అందరూ కలిసి ఒక కారు బుక్ చేసుకొని వెళ్లొచ్చు. అప్పుడు ఆ కారుకి అయ్యే ఖర్చు స్నేహితులందరూ కలిసి పే చేయవచ్చు. మొత్తం ట్రావెలింగ్ అయ్యే ఖర్చు రూ.2వేలు అనుకుంటే.. నలుగురు మిత్రులతో వెళ్లినప్పుడు ఒక్కొక్కరికి రూ.500 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది.

పాడ్ హోటల్స్ బుక్ చేసుకోండి...

హోటల్ రూమ్స్ ధరలు మాములు సమయంతో పోలిస్తే.. పండగల వేళ అధికంగా ఉంటాయి. అందుకే పాడ్ హోటల్స్ ఎంచుకోండి. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో విస్తృతంగా ప్రచారం పొందిన ఈ పాడ్ హోటల్స్ విధానం ఇప్పుడిప్పుడే మన దేశానికి పాకింది. ముంబయిలో ఇప్పటికే ఈ రకమైన హోటల్స్ ఉన్నాయి. ఇందులో బెడ్, బాత్రూమ్ ఇలా అన్నీ షేర్ చేసుకోవచ్చు. దీంతో ఖర్చు తగ్గుతుంది. ఇవి కాకుండా లక్సరీ హోటల్స్ బుక్ చేసుకుంటే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం.

రైలు ప్రయాణం..

పండగ వేళల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాలి.. అదీ కూడా బడ్జెట్ లో అంటే.. ది బెస్ట్ మార్గం.. రైలు. మీరు  ఏ తేదీన వెళ్లాల్లో ముందే తెలిస్తే.. మూడు నెలలు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అలా కాదు.. అర్జంట్ గా వెళ్లాల్సి వస్తే.. తత్కాల్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. తత్కాల్ టికెట్ ధర ఎక్కువైనా.. విమాన టికెట్ తో పోలిస్తే.. తక్కువగానే ఉంటుంది. కాబట్టి రైలు ప్రయాణం ఎంచుకోవచ్చు.

డిస్కౌంట్  డీల్స్...

పండగ సీజన్ లో కొన్ని సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వాటిని ఉపయోగించుకోగలిగితే.. కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు.  ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీస్  వెబ్ సైట్లు ఆఫర్ కూపన్లు ప్రకటిస్తుంటాయి. లిమిటెడ్ టైమ్ పీరియడ్ లో ఆ ఆఫర్ ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. వాటి ద్వారా  హోటల్స్, ఫ్లైట్స్, బస్ బుకింగ్స్ లో డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి. ... ఈ సలహాలతో ఈ పండగను మరింత సంతోషంగా జరుపుకోండి.

 

అథిల్ షెట్టి, బ్యాంక్ బజార్.కామ్ సీఈవో