మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరసగా 9వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. ఆయా నగరాల్లో మంగళవారం పెట్రోల్‌పై 29-32పైసలు, డీజిల్‌పై 26-28 పైసలను చమురు సంస్థలు పెంచాయి. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గత నాలుగు వారాలుగా చమురు ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వరంగ సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి.

తాజా పెంపుతో దిల్లీలో పెట్రోల్‌ ధర లీటరకు రూ. 76.87, డీజిల్‌ ధర రూ. 68.08గా ఉంది. లీటర్‌ పెట్రోల్‌ ధర ముంబయిలో రూ. 84.7, కోల్‌కతాలో రూ. 79.53, చెన్నైలో రూ. 79.79గా ఉంది. ఇక లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ. 72.48, కోల్‌కతాలో రూ. 70.63, చెన్నైలో రూ. 71.87గా ఉంది.

గత ఏడాది జూన్‌ నుంచి రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల 19 రోజుల పాటు ధరల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ఆ తర్వాత మళ్లీ ఈ నెల 14 నుంచి రోజువారీ మార్పులు చేస్తున్నాయి చమురు సంస్థలు. అప్పటి నుంచి వరుసగా 9వ రోజు నేడు ధరలను పెంచాయి.