Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ సొంత మొక్కు రాష్ట్ర సంక్షేమమా? :  ప్రొఫెసర్ కంచ ఐలయ్య

ప్రభుత్వాలకు మొక్కులుండవు. మెుక్కులుండేవి వ్యక్తులకే. వ్యక్తుల మొక్కులకు ప్రజానిధి వెచ్చించడం రాజ్యాంగ ఉల్లంఘనే.

హజ్, జెరూసలెం యాత్రలు కూడా సొంత మొక్కులే. వాటికి  మైానారిటీ సంక్షేమ నిధులివ్వడం తప్పు

personal vows cant be fulfilled with public money says Professor Ilaiah

తెలంగాణా ముఖ్యమంత్రి కె  చంద్రశేఖర్ రావు తిరుపతి వేంకటేశ్వర స్వామికి, విజయవాడ అమ్మవారితో పాటు వివిధ గుళ్లలో సొంత మొక్కబడి తీర్చుకునేందుకు  ప్రజాధనం వాడటం ఏ విధంగా  సమర్థ నీయం కాదు అని చెబుతున్నారు తెలంగాణా కు చెందిన ప్రముఖ పొలిటికల్ సైంటిస్టు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫెర్డ్.

 

ఏషియానెట్ ప్రతినిధి*కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  ‘కెసిఆర్ మొక్కు ఆయన వ్యక్తి గతం. దానిని తీర్చుకోవడమనేది వ్యక్తిగతం. సొంతమొక్కు తీర్చుకునేందుకు ప్రజాధనం వాడటం రాజ్యంగ పరంగా, చట్టపరంగా, నైతికంగా చెల్లదు’ అన్నారు. ఇదే విధంగా హజ్ యాత్ర, జెరూసలెం యాత్ర లకు ప్రభత్వం మైనారిటీ శాఖ నిధులివ్వడం కూడా  చెల్లదని ఆయన చెబుతున్నారు. ‘ఇవన్నీ కూడా సొంత మొక్కుల కిందికే వస్తాయి. వ్యక్తుల మొక్కుబడులు  తీర్చడం మైనారిటీ సంక్షేమం కావు,’ అని  కూడా అన్నారు.

personal vows cant be fulfilled with public money says Professor Ilaiah

ఇంటర్వ్యూ లోని కొన్ని అంశాలు :

ఇందులో చాలా అంశాలున్నాయి.  1. నైతికాంశం చూద్దాం.  చంద్రశేఖర్ రావు ఎపుడో తెలంగాణా రాక ముందు మొక్కు పెట్టుకున్నారు. వేంకటేశ్వర స్వామితో పాటుఎందరో దేవతలు మొక్కుకున్నారు. ఆయనేం మొక్కుకున్నారో తెలియదు.  తాను ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారో, కొడుకు మంత్రి కావాలని మొక్కుకున్నారో తెలియదు. ఇది పూర్తిగా వ్యక్తి గతం. అది పబ్లిక్ వ్యవహారం కాదు. ఇలాంటి వ్యక్తిగతమమయిన మొక్కులు తీర్చడానికి  ప్రభుత్వం ధనం ఎలా చెల్లిస్తారు. ఆయన ఎన్నో మొక్కుకుంటారు వాటిని ఇలా తీరుస్తూ ఫోతారా. ప్రభుత్వాలకు మొక్కులుండవు. కాబట్టి సొంతమొక్కులు తీర్చుకునేందుకు  ప్రభుత్వం సొమ్మువాడటం నైతికంగా కూడా సమర్థ నీయం కాదు. దీనిని అరికట్టాలి.

తాను ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారో, కొడుకు మంత్రి కావాలని మొక్కుకున్నారో తెలియదు. ఇది పూర్తిగా వ్యక్తి గతం. అది పబ్లిక్ వ్యవహారం కాదు. ఇలాంటి వ్యక్తిగతమమయిన మొక్కులు తీర్చడానికి  ప్రభుత్వం ధనం ఎలా చెల్లిస్తారు.

2. ప్రాంతీయాంశం చూద్దాం. ముఖ్యమంత్రి మొక్కుబడులుతీర్చుకునేందుకు  ఆంధ్రప్రాంతంలోని రెండు పెద్ద దేవాలయాలకు అందునా  బాగా రాబడి ఉన్న సంపన్న ఆలయాలకు అయిదున్నర  కోట్లు ఖర్చుచేశారు. ఇందులో అయిదున్నర కోట్లు తిరుపతికే  వెళ్లాయి. కొంత విజయవాడ కనకదుర్గకు వెళ్లాయి. ఇది తెలంగాణాకు ద్రోహం చేయడమే ఎందుకంటే, తెలంగాణాలో  చాలా దేవాలయాలకు రాబడే లేదు. ధూప దీపనైవేద్యాలకు నోచుకోని ఆలయాలెన్నో ఉన్నాయి. తెలంగాణా అర్చకులకు సంక్షేమం చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణా ఉద్యమ కాలమంతా ఆయన ఆంధ్రప్రాంతంలో ని ప్రతి అంశానికి వ్యతిరేకంగా పోరాడారు. ఏ విధంగా తీసుకున్నా తెలంగాణా ప్రాంతానికి ఏ మాత్రం ఉపయోగ పడని ఆంధ్ర ప్రాంత ఆలయాల మీద దాదాపు అయిదున్నర కోట్లు ఖర్చు చేయడం తెలంగాణా స్పిరిట్ కు విరుద్ధం.

 

3. చట్టపరంగా  చూద్దాం. దేవుళ్ల తో ఆయనకున్నవన్నీ వ్యక్తి గత మొక్కబడులు. ఇవన్నీ  స్టేట్ కు సంబంధంలేని మొక్కులు. 2015 లో ఇచ్చిన రెవిన్యూ జివొ నెం. 22,23 ప్రకారం ఆయన మొక్కులు తీర్చుకునేందుకు  కామన్ గుడ్ ఫండ్ నుంచి డబ్బులు ఖర్చు చేసి వజ్ర కిరీటాలు, హారాలు, కంటెలు తయారు చేయించారు. ఇది కామన్ గుడ్ ఫండ్ ఉద్దేశానికి వ్యతిరేకం.  కామన్ గుడ్ ఫండ్ అనేది అదాయం బాగా ఉన్న గుళ్లనుంచి  కొంత నిధి వసూలు చేసి దానిని ఆదాయం లేని గుళ్ల  కోసం ఖర్చు చేయాలి. అంటే ధూప దీప నైవేద్యాలకు, గుళ్లను  బాగు చేసేందుకు, అర్చకుల జీతాలకు ఖర్చుచేయాలి. ఇల అదాయమే లేని చిన్న చిన్న గుళ్లు తెలంగాణా లో చాలా ఉన్నాయి. వాటిని మీద ఏ మాత్రం ఖర్చుచేయకుండా అలాకాకుండా దేశంలోనే సంపన్న దేవాలయాల జాబితాలోకి వచ్చే గుళ్ల మీద ఖర్చు చేయడం చట్ట వ్యతిరేకం.

 

అధికారంలో ఉన్నవ్యక్తి ఇలా సొంత మొక్కుబడులు తీర్చుకునేందుకు ప్రభుత్వం నిధలు ఖర్చుచేయడం ఏ మాత్రం సబబు అనేదాని మీద చర్చ జరగాలి. ఈ నిధులను ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలి. న్యాయ స్థానం కూడా ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని హైలైటె చేసేందుకే హైకోర్టులో పిల్ వేశాం.

 

4. రాజ్యంగ పరం చూస్తే భారత రాజ్యంగం సారాంశంలో సెక్యులర్ రాజ్యాంగం. రాజ్యాంగం  ప్రియాంబుల్ లో స్పష్టంగా ఈ సెక్యులరిజాన్ని వ్యక్తీకరించడం జరిగింది.  ఇలాంటి మొక్కుబడులు - అవి తెలంగాణా  కోసం కావచ్చులేదా  రెండు తెలుగు రాష్ట్రాల కోసం కావచ్చు-  ప్రభుత్వ నిధులతో తీర్చుకోవడం సెక్యులర్ స్పిరిట్ కు  వ్యతిరేకం, కెసిఆర్ చర్య రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమే.

 

ఇలాగే ప్రభుత్వం మైనారిటీల సంక్షేమ నిధులను ముస్లిం ల హజ్ యాత్రకు, క్రైస్తవుల జెరూసలెం తీర్థ యాత్రలకు, వెచ్చించడం కూడా  చట్ట వ్యతిరేకం.  మక్కా వెళ్లాలనుకోడం, లేదా జెరూసలెం వెళ్లాలనుకోవడం కూడ, ముఖ్యమంత్రి మొక్కుల్లాగే,  వ్యక్తిగత మొక్కులే. చంద్రశేఖర్ రావు మొక్కులను ప్రభుత్వం నిధులతో తీర్చుకున్నట్లే మైనారిటీల వ్యక్తిగత మొక్కులను మైనారిటీ సంక్షేమ నిధులు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇది కూడా చట్ట వ్యతిరేకమే.

 

మైనారిటీ శాఖ నిధులు మైనారిటీల సంక్షేమానికి మాత్రమే ఖర్చుచేయాలి. సంక్షేమం అంటే, విద్య, వైద్యం, దారిద్ర్య నిర్మూలన  తదితర సామాజికాంశాలు. . తీర్థయాత్రలు కొందరి వ్యక్తుల మొక్కులు మాత్రమే. ఈ తీర్థయాత్రల విమాన ఖర్చులను  ప్రభుత్వం భరించడం సంక్షేమం ఎలా అవుతుంది. ఇది మైనారిటీలలో కొంతమందిని సంతృప్తి పరిచి అదే సంక్షేమం అని బుకాయించేందుకు ప్రయత్నం చేయడం అవుతుంది.

 

 ఈ మధ్య ప్రదేశ్ ప్రభుత్వ ఒక రైలు నిండా జనాన్ని తీర్థయాత్రలకు తీసుకువెళ్లుతూ ఉంది. ఇది కూడా తప్పే. అంతా వ్యతిరేకించాల్సి ఉంది.

 

అందుకే దీనిమీద జాతీయ స్థాయిలో మేం క్యాంపెయిన్ చేపట్టాలనుకుంటున్నాం. రాజకీయ వేదికలమీదే, న్యాయవవేదికలమీద, మేధావుల మధ్య  ఈ విషయం మీద చర్చ జరగాలి.  ఇలాంటి  ధోరణికి ముగింపు పలికేందుకు పెద్ద ఎత్తున  ప్రభుత్వాల మీద వత్తిడి రావాలి.

 

 

(* ఇంటర్వ్యూ : జింకా నాగరాజు)

Follow Us:
Download App:
  • android
  • ios