పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నాడు...

First Published 3, Dec 2017, 10:00 AM IST
pawans silence kapu and boya reservation politics of chandrababu Naidu
Highlights
  • రాష్ట్రంలో రిజర్వేషన్ల పాలిటిక్స్ రాజుకుంటున్నాయి. 
  • అయినా జనసేన నేత ఏమీ  మాట్లాడటం లేదు.
  • ఆయన ఎక్కడున్నా బయటకు వచ్చి తన వైఖరి చెప్పాల్సిన సమయం వచ్చింది.

జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడు? రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటున్న మనిషి రాష్ట్రంలో జరుగుతున్నసీరియస్ వ్యవహారాల మీద మాట్లాడకుండా సినిమా కలుగులో వెచ్చగా కూర్చుంటే ఎలా?

గత రెండు రోజులలో రాష్ట్రంలో రెండు మూడు ముఖ్యమమయిన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  అన్ని రాజకీయ పార్టీలు ఆవేశపూరితంగా మాట్లాడుతున్నాయి. ప్రకటనల యుద్ధం మొదలయింది. మేధావులు స్పందిస్తున్నారు.  ప్రశ్నిస్తున్నారు. అయితే  ప్రశ్నించేందుకే వస్తున్నాను, ప్రశ్నించేందుకు బతకుతానన్న పెద్ద మనిషి పత్తా లేడేమిటి?  ప్రశ్నించేందుకే నా పార్టీ  అని పవన్ చాలా సార్లు చెప్పారు. స్టార్ రూపంలో ఆయన దగ్గిర ‘పవర్ ’ ఉంది కాబట్టి వవర్ కోసం ఆయన రాజకీయం నడపరని  ప్రశ్నించేందుకే నడుపుతారని అంతా అనుకున్నారు. అయితే, ఇక్కడే ఆయన అభిమానులకు నిరాశే ఎదురవుతున్నది. అనంతపురం జిల్లా  మీటింగ్ నాటినుంచి చూస్తే ఆయన ప్రశ్నలు క్రమంగా తగ్గిపోవడమే కాని పెరగలేదు. ఇంకా స్పష్టంగా చెబితే, అసలు ప్రశ్నలే వినిపించడం లేదు.

ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేయించారు. ఒకటి కాపులను బిసిలలో ఎఫ్ క్యాటగిరిగా గుర్తించడం, రెండు బోయలను  లేదా వాల్మీకులను షెడ్యూల్డ్ ట్రైబ్ లలో చేర్చడం. ఈ తీర్మానాలను ఆయన కేంద్ర ఆమోదం కోసం పంపిస్థారు. కేంద్రం ఒకె అంటే సరి. లేదంటే,నేను చేయాలనుకున్న ప్రతిదానికి కేంద్రం అడ్డం వస్తోందని కేంద్రం మీదకు నెపం నెట్టేస్తారు. అదే బాబు రాజకీయం.

అయితే, ఈ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కలకలం మొదలయింది. అశాంతి నెలకొనే పరిస్థితి వస్తున్నది. చంద్రబాబు చర్యల మీద కాపులలో నే అనుమానాలున్నాయి,. టిడిపి భక్త కాపులు తప్ప  మిగతా వారు చంద్రబాబు నిజాయితీని శంకిస్తున్నారు. ఇక బయట,  కాపులను బిసిలలో కలపడాన్ని బిసినేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆందోొళన కు దిగారు. ఇంకో వైపు అసలు ఈ నివేదికను తాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనేలేదని  కాపు కమిషన్  ఛెయర్మన్ జస్టిస్ మంజునాథ వాపోతున్నారు. ఇది ముఖ్యమంత్రి చేతికి, అక్కడి నుంచి అసెంబ్లీకి ఎలా వెళ్లిందో ఛెయిర్మన్ ఆశ్చర్యపోతున్నారు. అంటే, పూర్తి గాని నివేదికను కమిషన్ నుంచి లాక్కొచ్చి  క్యాబినెట్ ముందు పడేసి ఒప్పేయించుకున్నారు. ఇదేం కమిషన్, ఇదేం నివేదిక, అసలిదేం ప్రభుత్వం? అని పవన్ ప్రశ్నించాలి. కమిషన్ నుంచి అసంపపూర్ణ నివేదికను లాక్కుని నివేదికను సమర్పించారని ప్రపంచానికి  చూపడమేమిటి? ప్రశ్నించేందుకే రాజకీయావతారం ఎత్తిన జననేత ప్రశ్నించాలి కదా.

ఇక బిసిల పరిస్థితి, వాళ్లు ఉద్యమం చేపడుతున్నారు. టిడిపి తెలంగాణ శాసన సభ్యడు ఆర్ క్రిష్ణయ్యే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు.ముఖ్యమంత్రి రాజేసిన  రెండో  చిచ్చు. బోయలను ఎస్ టి జాబితాలో చేర్చడం.దీనికి తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖ తదితరల జిల్లాలలోని గిరిజనసంఘాలు వ్యతిరేకత చూపుతున్నాయి. బోయలు ప్రస్తుతం బిసిలలో ఉన్నారు. అంటే, ఇతర గిరిజనుల కంటే బాగా వృద్ధి చెందిన కులం. ఈ కులాన్ని తీసుకువచ్చి చదువు సందె లేకుండా బాగా వెనబడిన గిరిజనలు మధ్య నిలబెడితే ఎలా అని వారు ప్రశిస్తున్నారు. నిన్నటినుంచి వారు ఆందోళన చేస్తున్నారు. ఆదివారం నాడు  రౌండ్ టేబుల్  కూడా నిర్వహిస్తున్నారు. బోయలను ఎస్ టిలలో చేర్చితే, ఈ వర్గాలకు ఉన్న  ప్రయోజనాలన్నంటిని బోయలు కాజేస్తారన్నది వాళ్ల ఆవేదన. దీనిని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడమే కాదు, కోర్టు కెళతామని కూడా గిరిజన నాయకులు నిర్ణయించారు.

బిసిలకు, కాపులకు; గిరిజనులకు, బోయలకు ఘర్షణలు తలెత్తే రంగం సిద్దమయింది. ఈ ఘర్షణనుంచి లబ్దిపొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది.

రాష్ట్రంలో కులాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్నా ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్   మాట్లాడకపోవడమేమిటి?  ప్రశ్నించకపోవడమేమిటి?

పవన్ సినిమా కలుగులోనుంచి బయటకు రావాలి. తన ధోరణేమిటో చెప్పాలి. తన పార్టీ విధానమేమిటో వెల్లడించాలి. రాజకీయ పార్టీ నేత  ఒపినియన్ చెప్పేందుకు జంకి తే ఎలా. పార్టీకి కార్యాలయాలు, సేవాకార్యక్రమాలే కాదు, పాలసీ కూడా ముఖ్యం. పవన్ ఇపుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద తన పాలసీ ఏమిటో చెప్పాలి. కేవలం ఎన్నికలపుడే జండా పడతానంటే కుదరదు.

 

loader