జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ కి ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్న మొన్నటి దాకా.. తెలంగాణ ఊసే ఎత్తని ఆయన.. ఇప్పుడు క్వింటాళ్ల కొద్దీ ప్రేమ కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తనకు జన్మనిస్తే.. తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందన్నారు. అసలు విషయం ఏమిటంటే..  పవన్ ప్రజా యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు తెలంగాణపై ఉన్న అభిమానాన్ని వివరించాడు.

ఆయనకు తెలంగాణపై నిజంగా అభిమానం ఉంటే ఉండొచ్చు. కానీ.. దానిని చెప్పేందుకు మరీ అతి చేయక్కర్లేదు. వందేమాతరం, తెలంగాణ నినాదం ఒకటేనని చెప్పుకొచ్చాడు పవన్. తెలంగాణను పొగిడితే తప్ప.. తెలంగాణ ప్రజలు తనను ఆదరించరు అని అనుకున్నారో ఏమో.. అందుకే ఈ రకం పోలికలు ప్రజల ముందుకు తీసుకువచ్చారు. పవన్ చెప్పిన స్పీచ్ అంతా బాగున్నప్పటికీ.. వందేమాతరంతో పోలికే.. అందరికీ ఇప్పుడు మింగుడుపడటం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. రాజకీయ పార్టీల ప్రస్తావన కూడా పవన్ తీసుకువచ్చారు. ఒకవైపు తనకు కేసీఆర్ అంటే ఇష్టమని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూనే.. కాంగ్రెస్ నేతలంతా తనకు అన్నదమ్ములని చెప్పాడు. అంతేకాదు.. తనకు తెలంగాణ ప్రజల ప్రేమ చాలని.. పదవులు అక్కర్లేదని కూడా చెప్పుకొచ్చారు. పదవులు ఆశించనప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు..? ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఎందుకు..? కేవలం ప్రేమే ఆశిస్తే సినిమాలు చేసుకుంటే సరిపోతుంది కదా..? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

పవన్ ఇంకా ఏమన్నారో చూడండి

నేను తెలంగాణ వ్యతిరేకిని కాను. నా సినిమాల్లో తెలంగాణ భాషను, యాసను, కవులను ప్రోత్సహిస్తూ వచ్చాను. తెలంగాణ నాయకులందరికీ విన్నపం నేనెవ్వరికీ వ్యతిరేకం కాదు.

*తెలంగాణ భాషకు చాలావరకు గౌరవం దక్కలేదు. తెలంగాణ పండుగలు, సంప్రదాయాల గురించి నా సినిమాల్లో చెప్పాను. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క ఇలా ప్రతీ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం దక్కాలి. 

*కరీంనగర్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నందుకు త‌న‌కు ఆనందంగా, గర్వంగా ఉంది

* బుద్ధుడు చెప్పినట్టు నన్ను ద్వేషించే వాళ్ళ గురించి ఆలోచించే స‌మ‌యం నాకు లేదు. నా సమయమంతా నన్ను ప్రేమించేవాళ్ళకోసమే.

*తెలంగాణ కవులు, కళాకారులు నాకు సన్నిహితులు. ప్రపంచ తెలుగుమహాసభలప్పుడు కూడా కొంతమందితో అదే చెప్పాను. నేను కోరేది ఒక్కటే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులున్నాయి. విభేధించడం.. గొడవపడడం నాకు ఆఖ‌రి అస్త్రాలు. 

*2019లో తెలంగాణ లో ఎన్నికల బరిలో ఉంటాం. జనసేన తెలంగాణ ఆడపడుచుల ఆకాంక్ష, యువత ఆకాంక్ష, ఉద్యమ కారుల ఆకాంక్ష. నన్నో అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా ఆశీర్వదించండి. అప్పుడప్పుడు నేను రాజీ పడ్డట్టుంటుంది. కానీ నేను రాజీపడను. నాకు లక్షల కోట్లు అక్కరలేదు.. మీప్రేమ ఉంటే చాలు. నాకు పదవులు అక్కర.లేదు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ పోరాటం జరిగిందో అందుకోసం నేను కూడా మీలో ఒకడిగా పోరాడుతాను