Asianet News TeluguAsianet News Telugu

పవనన్నా, బాణమేయాల్సింది ముంబయి మీద కాదు, ఢిల్లీ మీద

పవన్  ప్రశ్నించాల్సింది  ఊర్జిత్ ని కాదు, ప్రధాని మోదీని. ఆయన ట్వీట్లన్నీ  గురి లేకుండా గాల్లోకి పేల్చిన మతాబుల్లా ఉన్నాయి

pawan kalyan targets Urjit patel instead of Modi

ట్విట్టర్ చాటు నిలబడుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా పదునైన బాణాలే వేశాడు. అవి చాలా తీక్షణంగా ఉన్నాయి.  ఈ ట్వీట్లతో ఆయన యద్ధం ప్రకటించారు. అయితే, ఆయన ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారో... చెబుతాడని నిన్నటి దాకా చాలా మంది అభిమానులు ఎదురు చూశారు.

 

అయితే ఆ బాణాలను ఆయన ఎక్కుపెట్టింది ఎవరిమీదకో తెలుసా... ఊర్జిత్ పటేల్ అనే గవర్నమెంటు ఉద్యోగి మీద. ఆయన రిజర్వు బ్యాంకుకు గవర్నర్ కావచ్చు గాక ఆయన ఉద్యోగి మాత్రమే. పలికేవాడు, పలికించేవాడు ఎక్కడున్నాడో పవనన్న కు తెలియదా...

 

చివరి బాణం... నోట్లరద్దు బాణం...  ఢిల్లీ మీద ప్రయోగించకుండా ముంబయి మీద ప్రయోగించడంతోనే వ్యవహారం తుస్సుమంది.

 

పవన్ బాణం సంధించాల్సింది రిజర్వు బ్యాంకు మీద కాదు, పాలసీలన్నీ తయారయ్యే 7,లోక్ నాయక్ మార్గ్ (పూర్వం 7, రేస్ కోర్స్ రోడ్), న్యూఢిల్లీ.

నిన్నటి ట్వీట్లలో పవనన్న ఏకరువు పెట్టిన నోట్ల రద్దు కష్టాలకు కారణం ఆర్బ ఐ కాదు, అలాగే ఆర్బీ ఐ లో కూర్చునే  పెద్ద ఉద్యోగి కూడా కాదు.

 

ఈ దేశ ప్రజల కష్టాలకు,సుఖాలకు, ఈ లోక్ నాయక్ మార్గ్ (రేస్ కోర్స్ రోడ్ )  లోని ఏడో నెంబర్ ఇంటిలో కూర్చునే పెద్ద మనిషే.  అదెవరయినా కావచ్చు... ఓటేసిన పాపానికి ఈ ఇంట్లో  శీతాకాలం వెచ్చగా, వేసవి కాలం చల్లగా కూర్చునే పెద్ద మనిషే.  రాజకీయాలిక్కడ నడుస్తాయి. ఇక్కడ నడిచిందే తంత్రమే.  ఇది తెలియకుండా అమాయకుడయిన ఊర్జిత్ ను అడిపోసుకుంటే ప్రయోజనమేమిటన్నా పవనన్నా.

 

మీటింగ్లలో బుసకొట్టి తను చాలా ఆవేశపరుడనే భావం పవన్ కలిగిస్తాడు. బుస చైతన్యం కాదు. రిజర్వు బ్యాంకుకు, 7,ఎల్ ఎన్ మార్గ్ కు  తేడా తెలియక కాదు. పవన్ కు అంతా తెలుసు. ఆయన నాలుగురోజుల ట్వీట్లలో ఎంత బుస కొట్టినా అ దెవరి మీదో  అర్థమయి చావదు.

 

దీపావళి రోజు పిల్లలు గాల్లోకి రాకెట్లు ప్రయోగిస్తారు. అవి చాలా నిప్పులు చిమ్ముకుంటూ పెకెళ్లతాయి. పైకెళ్లాక కూడా నిప్పు రవ్వలు చిమ్ముతాయి. ఢామ్మని పేల్తాయి కూడా.  అవి క్షణాల్లో ఆరిపోతాయి. వాటిలో ఉన్న  అగ్ని ఏ మాత్రం ప్రమాదం కాదు. 

 

పవన్ కూడా గాల్లోకి రాకెట్లు ప్రయోగిస్తున్నాడనుకోవాలి.  శత్రువెవరో చెప్పకుండా యుద్దం ఎలా చేస్తాడో మరి.

 

ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరెత్త కుండ  యాబ్ స్ట్రాక్ట్ గా తెలుగుదేశం విధానాలను, అమరావతిని విమర్శిస్తాడు.జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ పేరెత్తకుండా  ప్రజలకష్టాలను ప్రస్తావిస్తాడు. బుసకొడతాడు.  రిజర్వు బ్యాంకు ఉద్యోగి ఊర్జిత్ పటేల్ ని నిలదీస్తాడు.

 

ఇది అమాయకత్వమా, అతి తెలివా? ఊర్జిత్ కు , మోదీకి తేడా తెలియనంత వెర్రిబాగులోళ్లా ప్రజలు..

 

మోదీ, చంద్రబాబు నాయుడు పెరెత్తడానికి భయమెందుకు?

 

ఇది అనుమానాలకు తావిస్తుంది.

 

 కష్టాలకు కారణమయిన వాళ్ల జోలికి వెళ్లకుండా గాల్లోకి మతాబులు పేల్చి, ఎంతయిన ‘ పవన్ మంచివాడు, మనల్ని మాట వరసకు కూడా తిట్టడంలేదు’ అని అనిపించుకోవావలనుకుంటున్నాడా.

 

పార్టీని నడిపించే వాడి జోలికి వెళ్లకుండా, పార్టీని జనరల్ గా తిట్టి,  2019 కి ముందు  సంప్రదింపులు కోసం ఒక కిటికి తెరిచి పెట్టుకుంటున్నాడా...

 

 పెద్ద నోట్ల రద్దుతో క్యూల్లో నిలిచి ప్రాణాలు పోగొట్టుకున్న అమాయకుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ఆర్‌బిఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ను జననేత అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించడంలో మతలబు ఏమిటి?  

 

అది ప్రధాని నిర్ణయమని  అరుణ్ జైట్టీ, అమిత్ షా  చెప్పడం పవన్ కు తెలియదా. అసలు సలహా  ఇచ్చిందే నేనని ప్రకటించిన మన ముఖ్యమంత్రి బాబు గారి సంగతేమిటి? అంతా ఊర్జితే అనడం బాబు గారి అవమాన పర్చడం కాదా.

 

నోట్ల రద్దు గురించి నిన్న ఆయన అన్న మాటలు :

 

  • నోట్ల మరణాలకు ఊర్జిత్‌దే బాధ్యత.
  • నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధ్యమని మీరు భావిస్తున్నారా?
  • ఆదివాసీలు, రైతులు, దినసరి కూలీలు, గహిణులు, ఉద్యోగులు, వద్ధులు, పండ్లు, కూరగాయాల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు ఇలా చాలా మంది కష్టాలు పడుతున్నారన్నారు.
  • సామాన్యులు ప్రాణాలు విడుస్తుండగా.. అక్రమార్కులు మాత్రం తమ ఇళ్లలో సుఖంగా కూర్చొని సంపదను మార్చుకుంటున్నారన్నారు.
  • దేశ వ్యాప్తంగా 86శాతం నగదు బ్యాంకుల్లో డిపాజిట్‌ కావడంతో ఆనందంతో గంతులు వేస్తుండవచ్చు, నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందని గర్వంగా చెప్పుకుంటుండొచ్చు.. కానీ మీరు పాత దానిని కొత్త దానితో మార్చారు.
  • దోపిడీదారుల వర్గంలో బ్యాంకింగ్‌ ఉద్యోగులను కూడా చేర్చారు.

 

దీని కంతా ఊర్జిత్ పటేల్ కారణమనడం ఏమి రాజకీయమో పవనే చెప్పాలి.

Follow Us:
Download App:
  • android
  • ios