Asianet News TeluguAsianet News Telugu

పవనన్నా , పునర్దర్శనం ఎపుడో?

పవన్ విశాఖ లో చాలా  బాగా మాట్లాడినా,  అభిమానుల్ని ఉత్తేజ పరిచినా, ఆయన చెప్పాల్సింది చాలా ఉంది. మళ్లీ ఎపుడు కనిపిస్తాడో తెలియదు

pawan clarified many things in vizag but his political program remains still uncertain

జనసేనాని పవన్ కల్యాణ్ సుడిగాలిలా విశాఖ చుట్టి వెళ్లాడు.

ఆయన రావడం ఆయన అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఉత్సాహం ఉరకలెత్తించింది.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవిటీకరణను వ్యతిరేకిస్తూ  ఆత్మబలిదానం చేసిన ఉద్యోగి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చినా ఆయన విశాఖ నుంచి స్పష్టమయిన సంకేతాల్ని పంపించాడు. ఇది ఈ ట్రిప్పు విశేషం. అయితే, పవన్ మీద ఒక అపవాదు ఉంది. ఆయన రాజకీయాలను ఇంకా తీసుకోవాల్సినంత సీరియస్ గా తీసుకోవడం లేదన్నది అపవాదు. ఒక్క అనంతపురంలో జరిగిన సమావేశం తప్ప ఆయన పర్యటనల్నీ ఏదో ఒక సమస్యమీద జరిగినవే. జనసేన తరఫున ప్రజలనుసమీకరించేందుకు  జరిపిన రాజకీయ సభలు కాదు. ఇలాఒక సమస్యమీద ఒక ప్రాంతంలోపర్యటించి అక్కడ రాజకీయాలుమాట్లాడటమే జరిగింది అదేచాలా మందికి నచ్చలేదు. ఆయనంత పార్ట్ టైం పొలిటిషయన్ అని, సినిమా కలుగు నుంచి రాలేక పోతున్నాడని, అలాంటి రాజకీయాలు సక్సెస్ కావని అన్నారు.  దీనికి తోడు సమస్యల మీద సాగిన పర్యటనల మధ్య చాలా గ్యాప్ వుంది. తిరుపతి పర్యటన కర్నాటక లో ఒక అభిమాని హత్యానంతరం సాగింది.  శ్రీకాకుళ పర్యటన కిడ్నీజబ్బులగురించి, అమరావతిప్రాంత పర్యటన రైతులకు మద్ధతుగా సాగింది.  దానికితోడు అనే క ముఖ్యమయిన సమస్యల మీద స్పందించకపోవడం కూడా చాలా మందిని నిరుత్సాహపరిచింది. ఇలా రావడం ,అలా పోవడం అని జోకులేశారు. ఇపుడు వైజాగ్ పర్యటన కూడా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి ఆత్మబలిదానం గురించి సాగింది. ఈ దుర్ఘటన లేకపోతే, ఆయన వచ్చే వాడు కాదేమో...అని విమర్శ.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కొత్త ప్రయోగమని, దానిని కొంత మంది కుట్రచేసి నాశనం చేశారని, వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటానని కూడా ఆయన అన్నారు.

సరే వచ్చారు. మళ్లీ పునర్దర్శనం ఎపుడు? అని చాలా మంది ఇపుడు ప్రశ్నిస్తున్నారు. జోక్స్ వేస్తున్నారు

జగన్ లాగే ఆయన కూడా పాదయాత్ర చేస్తాడని వార్తలొచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని విశాఖ పర్యటన చెబుతుంది. ఉస్మానియాలో పరిస్థితి ప్రశాంత పడితే, తాను పర్యటించి విద్యార్థులను కలుసుకుంటానని అన్నారు. బహుశా ఇలా సమస్యలమీద ఆయన పర్యటనలుంటాయనేది మెసేజ్. అయితే, ఈ సారి ఆయన పేరెత్తకుండా ప్రతిపక్ష నేత జగన్  మీద చురకలేశాడు. తెలుగుదేశంతో తానెలా ఉండబోతున్నాడో చెప్పాడు. ఈసారి ఆయన అందరి మీద విరుచుకుపడ్డాడు.  రాజకీయాలంటే తనకున్న అభిప్రాయాన్ని గొప్పగా చెప్పాడు. తన ఎన్నికల పంథా ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. ప్రతీ పనిని ముఖ్యమంత్రి  కుర్చీకి లింకు పెట్టి హామీలిచ్చే వ్యవస్థ పోవాలనడం స్పష్టంగా జగన్ మీద ఎక్కుపెట్టిన బాణమే. ఒక వైపు ముఖ్యమంత్రి గత మూడున్నరేళ్లుగా ఆంధ్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు. అమరావతి గ్రాఫిక్ డిజైన్లు చూపించి ప్రపంచంలో నెంబర్ వన్ ఇదే నంటున్నాడు. పిచ్చి పిచ్చిగా వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇపుడు జగన్ కూడా అదే దారిలోనే వెళ్తున్నారు. ప్రతివూరికి,ప్రతికులానికి, ప్రతివర్గానికి జగన్ హామీలు గుప్పిస్తున్నాడు. ఇలాంటి వ్యవస్థ వద్దని ఆయన స్పష్టంగా చెప్పాడు.   తన రాజకీయాలు కుర్చీ రాజకీయాలు కావని ఆయన స్పష్టం చేశాడు. నాలుగేళ్ల తర్వాత టిడిపి, బిజెపిలు  చేస్తున్న పనులు చూశాక, ఇక ప్రశ్నించ కుండా ఉండని పరిస్థితి ఎదురయిందని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలకు 2019లో వోట్లడిగే హక్కులేదని కూడా చెప్పాడు. దీనిని బట్టి ఆయన అటు ప్రతిపక్షంతో పోకుండా, ఇటు అధికార పార్టీలతో ఉండకుండా థర్డ్ ఫోర్స్ గా ఉండబోతున్నాడా? 

ఇక్కడే సమస్య వస్తున్నది.

ఆయన వ్యతిరేకించేవాళ్లు, ప్రతిపక్షపార్టీ నేతలు పవన్ ను విమర్శిస్తున్నదిక్కడే. ఇలా మూడో పార్టీ గా నిలబడితే, ప్రభుత్వ వ్యతిరేక వోట్లు చీలిపోయి తెలుగుదేశానికి సాయం చేసినట్లువుతుందని వారి వాదన. అందుకే పవన్ ని స్పాన్సర్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ యేననేది వారి  ఆరోపణ. ఇది అన్ ఫెయిర్ గా కనిపిస్తున్నా దీనికి ఆయన సమాధానం ఏమిటో చూడాలి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios