స్వదేశీ మ్యాగీ నూడిల్స్ తో మార్కెట్లో కి అడుగుపెట్టింది పతంజలి బ్రాండ్. విదేశీ బ్రాండ్ లు దేశంలో రాజ్యమేలుతున్న సమయంలో స్వదేశీ ప్రోడక్ట్స్ గా పంతజలి వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైన టూత్ పేస్ట్, షాంపూ, తేనే వంటి వాటిని ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇప్పడు పతంజలి నుంచి దుస్తులు రాబోతున్నాయి.

మహిళలు, పురుషులు, చిన్నారుల కోసం స్వదేశీ దుస్తులను తయారు చేస్తున్నట్లు పతంజలి నిర్వాహకులు ఈరోజు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి వీటిని తీసుకొచ్చే యోచనలో ఉన్నామని పతంజలి ఆయుర్వేద అధికార ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా చెప్పారు. తొలి దశలో భాగంగా.. దేశవ్యాప్తంగా 250 రిటేల్‌ అవుట్‌లెట్ల ద్వారా ఈ దుస్తులను అమ్మనున్నారు. ఏడాదికి రూ.5వేల కోట్ల విలువైన అమ్మకాలే లక్ష్యంగా దుస్తులను తయారుచేసినట్లు తిజారావాలా చెప్పారు. బిగ్‌బజార్‌ లాంటి స్టోర్లలోనూ ఈ దుస్తులను అందుబాటులో ఉంచనున్నారట. త్వరలోనే దుస్తులను ప్రవేశపెడతామని గతేడాదే రామ్ దేవ్ బాబా తెలిపిన సంగతి తెలిసిందే.