పార్లమెంట్ సమావేశలకు హాజరైతే ప్రతిపక్షాల దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టలేమన్న నిర్ణయానికి భాజపా వచ్చినట్లుంది.
ప్రజా సమస్యలపై చర్చలు జరిపి పరిష్కార మార్గాలు చూపాల్సిన పార్లమెంట్ అధికార-విపక్షాల బలనిరూపణకు వేదికగా మారిపోయింది. దాంతో పార్లమెంట్ సమావేశాలంటేనే ప్రజలు ఏవగించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుక్కుంటారన్న భ్రమలను ప్రజలు ఎప్పుడో వదిలేసుకున్నారు. అయితే, ఈ ధోరని ఇప్పుడే మొదలైంది కాదు గానీ ఎన్డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువైపోయింది.
లేకపోతే, దేశం మొత్తాన్ని ఓకేసారి అతలాకుతలం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడి నిర్ణయంపై చర్చలు జరిపటానికి భాజపా ససేమిరా అంటోంది. దేశ ప్రజల ఇబ్బందులను చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టటంతో సభ గడచిన 15 రోజులుగా జరగటమే లేదు. మోడి తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్ధే తల్ల క్రిందులవుతోంది. పైగా సభ జరగక పోవటానికి కారణం మీరంటే కాదు మీరని బురద చల్లుకుంటున్నాయి.
చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను హటాత్తుగా రద్దు చేయటంతో నవంబర్ 8వ తేదీ రాత్రి నుండి మొదలైన సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నదే కానీ ఏమాత్రం తగ్గటం లేదు. ముందుచూపు లేకుండా 86 శాతం చెలామణిలో ఉన్న నగదును అర్ధాంతరంగా రద్దు చేయటంతో సమస్యలు ఒక్క సారిగా పెరిగిపోయాయి.
దానికి తోడు ఆర్బిఐ, కేంద్రం తీసుకుంటున్న రోజుకో నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. నగదు లభ్యత విషయంలో ఆర్బిఐ చెబుతున్న దానికి వాస్తవానికి ఏమాత్రం పొంతన లేకపోవటంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. దాంతో ప్రజల అవసరాలు తీర్చటానికి సరిపడా డబ్బు తమ వద్ద ఉందని ఆర్బిఐ చెబుతున్నది అబద్దాలని తేలిపోయింది.
ఎందుకంటే, పలు బ్యాంకుల వద్ద ‘డబ్బు లేదు’ అన్న బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. అదేవిధంగా, ఏటిఎంలు కూడా చాలా వరకూ మూత పడ్డాయి. అవసరానికి గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడుతున్న వారిలో ఇప్పటికి సుమారు 85 మంది మృతిచెందారు. ఇటువంటి ఘటనలను, వాస్తవాలను ప్రతిపక్షాలు ఉబయ సభల్లో ప్రస్తావిస్తున్నాయి.
నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలతో ప్రధాని ఖంగుతిన్నారు. దాంతో పార్లమెంట్ సమావేశలకు హాజరైతే ప్రతిపక్షాల దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టలేమన్న నిర్ణయానికి భాజపా వచ్చినట్లుంది. అందుకనే ఇంత వరకూ ప్రధాని పార్లమెంట్ సమావేశాలకు మొహం చాటేస్తున్నారు. ఫలితంగా పార్లమెంట్ సమావేశాలు అధికార-ప్రతిపక్షాల మధ్య బలనిరూపణకు వేదికగా మారిపోయింది.
