ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ యాంకర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఈ యాంకర్ ఏం చేసిందో తెలుసా..? తన కుమార్తెను ఒళ్లో కూర్చొపెట్టుకొని మరీ వార్తలు చదివింది. ఒక విషాద సంఘటనపై నిరసన తెలిపిందుకు ఆమె అలా వార్తలు చదివారు.

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ లోని కసూర్ ప్రాంతానికి చెందిన జైనబ్ అన్సారీ అనే 8 ఏళ్ల చిన్నారిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ చిన్నారిని పలు మార్లు అత్యాచారం చేసి అనంతరం దారుణంగా హత్య చేశారు. చిన్నారి మృత దేహం ఓ చెత్త కుప్ప దగ్గర ఈ నెల 9వ తేదీన లభించింది. ఆ బాలిక ఖురాన్ నేర్చుకోవడానికి వెళుతుండగా దుండగులు  ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. కాగా ఈ ఘటన యావత్ పాకిస్థాన్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆందోళనలు చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరిగింది. ఈ ఘటనపై పాకిస్థానీ యాంకర్  కిరణ్ నాజ్ వినూత్నంగా స్పందించారు.

 

రోజూ వార్తలు చదివేందుకు  స్టూడియోకి వచ్చే కిరణ్.. గురువారం మాత్రం.. వెంట ఆమె కూతుర్ని కూడా తీసుకువచ్చింది.  లైవ్ లో తన కమార్తెను ఒళ్లో కూర్చొపెట్టుకొని మరీ ఆమె వార్తలు చదివింది. తనని తాను కిరణ్ నాజ్ గా కాకుండా ఒక తల్లిగా పరిచయం చేసుకొని వార్తలు చదివింది. తానిప్పుడు ఒక అమ్మనని అందుకే తన కుమార్తెను కూర్చొపెట్టుకొని మరీ వార్తలు చదువుతున్నట్లు ఆమె చెప్పారు. చిన్నారి హత్య తనను ఎంతగా కలచివేసిందో ఆమె వివరించారు. ఆమె భావోద్వేగంతో మాట్లాడిన మాటలు.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.