గౌరవించకపోగా.. అవమానించారు

ఒక దేశ ప్రధాని.. మరో దేశ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఎన్నో రాచమర్యాదలు అందుకుంటారు. అతిథ్య దేశం.. ఆ ప్రధానికి చేయని మర్యాదలు అంటూ ఉండవు. భద్రత దగ్గర నుంచి వారి ఫుడ్ సహా.. అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ.. అమెరికా ప్రభుత్వం మాత్రం పాకిస్థాన్ దేశ ప్రధానికి మర్యాదలు చేయకపోగా.. అవమానించింది. పాక్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీకి అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ చేదు అనుభవం ఎదురైంది.

సాధారణంగా ఎవరినైనా ఎయిర్ పోర్టులో సెక్యురిటీ సిబ్బంది చెక్ చేస్తారు. ఇది సాధారణం. కానీ దేశాధినేతలు, ప్రధానులకు ఇలాంటివి వర్తించవు. అధికారులే స్వయంగా వచ్చి ఆహ్వానిస్తారు. కానీ పాక్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీని మాత్రం న్యూయార్క్ సిబ్బంది చెక్ చేశారు. ఆయన ఓ సగటు పౌరుడిలాగా ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్స్ అన్నింటినీ దాటుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అని అప్పుడే కొందరు విశ్లేషిస్తున్నారు.

అయితే పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ కథనం మాత్రం మరోలా ఉంది. అబ్బాసీ తన వ్యక్తిగత పని మీద అమెరికా వెళ్లారని, అందుకే ఇలా సెక్యూరిటీ చెక్‌కు సహకరించారని ఆ పత్రిక చెబుతున్నది. వ్యక్తిగత జీవితంలో అబ్బాసీ ఇలా నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడతారని తెలిపింది. గత శనివారం ఆయన న్యూయార్క్ వెళ్లారు. అయితే పాక్ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులకు వీసాలు ఇవ్వకూడదని అమెరికా భావిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.