24గంటల్లో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కళ్లు పచ్చబడ్డాయి. నిన్నటి దాకా ఏపీ సీఎం చంద్రబాబుని విమర్శించిన ఆమె.. ఇప్పుడు అదే నోటితో చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని జగన్ ఉమ్మడిగా తీసుకున్నారని సంగతి అందరికీ తెలిసిందే. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమావేశాలను బహిష్కరించిన గిడ్డి ఈశ్వరి ఇప్పుడు పార్టీ ఫిరాయించగానే.. దానికి రివర్స్ లో మాట్లాడుతున్నారు. అసలు సంగతేంటంటే..ఆమె.. సోమవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే హోదాలో ఆమె మంగళవారం శాసనసభ సమావేశాలకు కూడా హాజరయ్యారు. పార్టీలోకి మారిన రెండో రోజే ఆమెకు శాసనసభలో మాట్లాడే అవకాశం లభించింది.

ఆమె మాట్లాడుతూ.. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలను శాసనసభ లో చర్చించాల్సిన బాధ్యత శాసన సభ్యులపై ఉందన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించుకునేందుకే టీడీపీలో చేరానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. కోట్లు ఉన్నవారికే సీట్లు ఇస్తామన్న జగన్ వాక్యాలు తనను బాధించాయన్నారు. ప్రజా సమస్యల పట్ల ముఖ్యమంత్రి చేస్తున్న కృషి మరువలేనిదని ఆమె అన్నారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పాడేరులో టీడీపీ జెండా ఎగిరెలా కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

కాగా.. అసెంబ్లీలో గిడ్డి ఈశ్వరి మాట్లాడిన మాటలు నీతులు చెబుతున్నట్లుగా ఉన్నాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. నిన్నటిదాకా ఆమె కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారన్న విషయం మర్చిపోవద్దని పలువురు సూచిస్తున్నారు. టీడీపీలోకి చేరగానే జగన్ పై విమర్శలు చేయడం సరికాదని సూచిస్తున్నారు.