పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గుట్టు రట్టుఅయ్యిందా? మంత్రి పదవి కోసమే ఆమె పార్టీ మారారా? ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు బయటపడ్డాయా? అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం గిడ్డి ఈశ్వరి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె పార్టీ మారడానికి గల అసలు కారణాలు తెలియజేసే ఆడియో టేపు బయటపడిందన్న విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది.

అసలు విషయం ఏమిటంటే.. పార్టీ ఫిరాయించడానికి ముందు గిడ్డి ఈశ్వరి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారితో తాను పార్టీ ఫిరాయించుకోవాలనుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే.. అందుకు కార్యకర్తలు అంగీకరించలేదట. వైసీపీలోనే కొనసాగాలని సూచనలు ఇచ్చారట. అయితే.. ఆమె తాను పార్టీ మారడం వలన కలిగే లాభాలను కార్యకర్తలకు వివరించినట్లు సమాచారం.

టీడీపీలో చేరితో మంత్రి పదవి ఇస్తానని వాగ్ధానం చేశారని, మంత్రి వర్గ విస్తరణ ఇప్పటిలో లేకపోతే  క్యాబినేట్ హోదా గల ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవైనా ఇస్తామని టీడీపీ పెద్దలు హామీ ఇచ్చారట. అందుకే తాను పార్టీలో మారుతున్నానని ఆమె కార్యకర్తలకు వివరించారట. అసలు తనకు చంద్రబాబు అంటే ఇష్టం లేదని.. కాకపోతే మంత్రి పదవి కోసం వెళ్లక తప్పడం లేదని చెప్పారట. అలా ఆమె చెబుతున్న మాటలను కార్యకర్తల్లో ఒకరు రికార్డు చేశారని.. ఇప్పుడు ఆ ఆడియో టేపు కలకలం సృష్టిస్తోందనే ప్రచారం మొదలైంది. ఇదిలా ఉండగా పార్టీ మారినందుకు టీడీపీతో గిడ్డి ఈశ్వరి  రూ.35కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.