అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మంగళవారం ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. గోరంట్ల-పుట్టపర్తి మార్గంలో ఓ వ్యక్తి బైక్ పై వస్తూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టబోయాడు. గమనించిన బస్సు డ్రైవర్‌ ఇక్కసారిగా స్టీరింగ్‌ను పక్కకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులను ఢీకొని సమీపంలోని బావి వద్దకు దూసుకెళ్లింది.

బస్సు 30 అడుగుల లోతున్న బావిలోకి ఒరిగినప్పటికీ డ్రైవర్‌ చాకచక్యంతో వ్యవహరించి బ్రేకులు గట్టిగా వేసి ఆపగలిగాడు. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్‌ అరగంట వరకు అలాగే బస్సును నియంత్రించిన తర్వాత పోలీసులు, స్థానికులు ప్రయాణికులను నెమ్మదిగా కిందకి దించారు. ఈ ప్రమాదంలో ఓ పాదచారుడు అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్లిష్టమైన అప్రమత్తంగా ఉండి 50 మంది ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ని అందరూ ప్రశంసలతో ముంచెత్తారు.