నన్నారి షర్బత్ అనే పిలుపు వేసవిలో రాయలసీమ అంతటా మారుమ్రోగుతుంది. ఎంత ఎండలో తిరిగొచ్చినా నన్నారి గోంతులో పడితే హాయి. నన్నారి లేని సోడా బంకు,  కూల్ డ్రింక్స్ షాపు ఉండదక్కడ.  రాయలసీమలోనే దొరికే  ఒక విశిష్టమయిన వేరు నుంచి తయారయ్యే రసమిది. 

నన్నారి షర్బత్..

వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ప్రకృతి ఆ సమయానికనుగుణంగా పుచ్చకాయలు,తాటిముంజలను ఇస్తుంది.

ఇక సామాన్యుల దాహం తీర్చడానికి చలివేంద్రాలు వెలిస్తే,వీధి చివరల్లో చెరుకురసం బండ్లు వెలుస్తాయి.,మంచినీళ్లు,మజ్జిగ పాకెట్లలో అమ్ముతున్నారు.ఇక వేసవే కాకుండా మిగిలిన కాలాల్లోనూ బహుళజాతి వ్యాపారుల శీతలపానీయాలదే అగ్రస్థానం.


ఈ వేసవిలో రాయలసీమ జిల్లాల్లోని శీతల పానీయ దుకాణాల్లో కనిపించే,వినిపించే పేరు నన్నారి.దీన్నే షర్బత్ గా కొందరు వ్యవహరిస్తారు.
ఇంతకూ ఈ నన్నారి ఏమిటంటారా?


ఇది దక్షిణ భారతదేశంలో విస్తారంగా కనిపించే మారేడు కొమ్ములు,నన్నారి కొమ్ములు గా పిలవబడే చెట్టు వేర్లు.ఈ చెట్టు Apocynaceae అనే వృక్షజాతికి చెందిన Decalepis hamiltonii అనే చెట్టు.దీన్ని ఆంగ్లంలో swallow root అనీ వ్యవహరిస్తారు.ఈ చెట్టుకు ఎన్నో ఔషదగుణాలతో పాటూ నిలువధాన్యంలోని పురుగుపుట్రను దరిచేరనివ్వని క్రిమిసంహారక గుణాలూ ఉన్నాయని పరిశోధనల్లో తెలిసింది.ఇక వీటి వేర్లకు anti oxidanT గుణాలున్నాయనీ పరొశోధకులు చెబుతున్నారు.

అడవుల నుంచి ఈ చెట్టు వేర్లను సేకరించి పట్టణాల్లో అమ్ముతారు.

ముందుగా ఈ వేర్లను నీటిలో సుమారు 3 గంటలపాటూ ఉడకబెడతారు.ఆ తర్వాత వడకట్టిన నీటిని పక్కకు తీసి దానిలో సరిపోయినంత పంచదార కలిపి మరో 2,3 గంటలు ఉడికించి చిక్కటి ద్రవాన్ని తయారు చేస్తారు.


దుకాణాల్లో మనం బాటిళ్లలో చూసే నల్లని ద్రవం ఇదే.ఇక ఈ ద్రవాన్ని గ్లాసులో పావుబాగం వరకు పోసి,ఒక బద్ద నిమ్మరసం కలుపుతారు.ఆ తర్వాత సోడాను కలిపి ఇస్తారు.

ఔషధ గుణాలు కలిగిన ఈ నన్నారి షర్బత్ వేసవి దాహన్నీ తీర్చడమే కాక antioxidant గానూ పని చేస్తుంది.

ఈ వృక్షజాతి ఇప్పుడు అంతరిచిపోతున్న జాతుల జాబితాలో త్వరలో చేరబోతోందని ప్రకృతి ప్రేమికులు బాధపడుతున్నారు.