తెలంగాణ కేంద్రంగా సెంట్రల్ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజాంబాద్  టిఆర్ ఎస్ ఎంపి కవిత చాలా రోజులుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. పసుపు పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీనికి వప్పించారు. వారి చేత ప్రధానికి లేఖలు రాయించారు. ఈ రోజు ఆమె కూడా ప్రధానిని కలుసుకున్నారు.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత, నియోజక వర్గ ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కోరారు. ఈ రోజు కవిత బృందం పార్లమెంటులో ప్రధానిని కలుసుకున్నారు. పసుపుకు సంబంధించిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖలను ప్రధాన మంత్రికి అందజేశారు.

ఈ సమావేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది. నెలాఖరులోనో, సెప్టెంబర్ మొదటి వారంలోనో ప్రధాని క్యాబినెట్ విస్తరణ చేపడతారంటున్నారు. అందులో ఒక సీటు టిఆర్ ఎస్ కు దక్కుతుందని,మొన్నామధ్య ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని కలిసినపుడు చర్చ జరిగిందని పార్టీ వర్గాల్లో వినబడుతూ ఉంది. ఇలాంపుడు ఒక సారి ప్రధానికి కనిపించేందుకు పసుపు బోర్డు పనికొచ్చింది. సరే, ఇపుడు మళ్లీ నేటి అంశానికి వస్తే...

ఇప్పటికే వివిధ రాష్టాల ముఖ్యమంత్రులు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి కి లేఖలు రాశారు. దీని వెనక కూడా కవిత కృషి ఉంది. ‘పసుపు పంట పండించే ముందు విత్తనాల విషయంలో, పండించిన పంటను కోనుగోలులో ఎక్కడ సరైన విధానము లేదు.పసుపు కు ఓక ప్రత్యేక బోర్డు ఉండాలి.పసుపు కు కనీస మద్దతు ధర లేదు.విదేశాల నుంవి పసుపు దిగుమతి చేసుకోవడం వలన మన రైతులకు నష్టం జరుగుతుంది.ప్రధాన మంత్రి కి పసుపు రైతుల ఇబ్బందులను వివరించాను, ’ అని కవిత చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.