శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఎంత సందడుందో ఇపుడు. ఊరంతా పండగ వాతావరణం కనిపిస్తాంది.నిమ్మాడ గ్రామం మొత్తం విద్యుద్దీపాల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. వచ్చిపోయే వాహనాలు, హడావిడిగా ఉంటున్నటిడిపి నేతలు.ఒకటే కోలాహలం.


ఇదంతా ఎందుకంటే, రేపు, అదివారం, శ్రీకాకుళం ఎంపి కింజారపు రామ్మోహన నాయుడి రిసెప్షన్ ఉంది. దీనికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రామ్మోహన్‌నాయుడు వివాహం 14న విశాఖపట్నంలో జరిగిన విషయం తెలిసిందే. ఇపుడు స్వగ్రామం నిమ్మాడలో  వైభవంగా రిసెప్షన్ జరిపేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.  నిమ్మాడ సందడి అదే. ఈ రోజు  సాయంత్రం రామ్మోహన్‌నాయుడుని గుర్రం బగ్గీపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 


వందలాదిమంది టెక్నీషియన్స్‌, కూలీలు రిసెప్షన్‌ శిబిరం నిర్మణాంలో ఉన్నారు.  నిమ్మాడ ఎఫ్‌సీఐ గోదాములకు సమీపంలోని 20 ఎకరాల స్థలంలో రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒంగోలు జిల్లా అద్దంకికి చెందిన డెకరేషన్‌ బృందం గత పది రోజులుగా భారీషెడ్స్‌  వేస్తున్నది.


ఒక వేళ  పెద్దగాలులు,తుఫాను వచ్చినా ఏ  మాత్రం చెక్కుచెదరనంత పకడ్బందీగా రేకుల షెడ్స్‌ వేసి విఐపిలో కోసం ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా తయారుచేసిన షెడ్స్‌లో పసందైన వంటలు ఓవైపు, ఇంకోవైపు సినీగాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు చెందిన ఆర్కెస్ట్రా  వీనులు విందు చేయబోతున్నది.  
రిసెప్షన్‌కు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వస్తారని ఒకటే చర్చ. 


వాహనాలను పార్కింగ్‌ కోసం జాతీయ రహదారి పక్కన, గ్రానైట్‌ ఫ్యాక్టరీకి ఎదురుగా జాగా  సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో మిరుమిట్లు గొలిపే బాణా సంచా కాల్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.


ఈ ఏర్పాట్లే కాదు, విందుకుడా  పసందుగా ఉండబోతున్నది.


విందు వంటల కోసం  ధవళేశ్వరం నుంచి ప్రత్యేక వంట సిబ్బందిని సుకువచ్చారు. మొత్తం భోజనంలో 15 రకాల వంట కాలు అందిస్తారని ఈ ఏర్పాట్లలో ఉన్న వ్యక్తి ఒకరు చెప్పారు. ఏముంటాయంటే..  తాపేశ్వరం ఖాజ, చక్రపొంగళి, పనసకాయ బిర్యానీతో పాటు నాలుగు రకాల కూరలుంటాయి. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అమితంగా ఇష్టపడే గూనచారు కార్యక్రమం స్పెషల్ అంటున్నారు.  ఇవి కాకుండా ఎన్నో రకాల స్టార్టర్స్ కూడా సిద్ధంచేస్తున్నారు.


ఎంతమంది వచ్చినా  విందారగించేలా చాలా  కౌంటర్లను సిద్ధం చేశారు.