పెద్ద నోట్ల రద్దుపై చంద్రబాబు అధ్యక్షతన ఉపసంఘం ఐదు రాష్ట్రాల సీఎంలతో ఏర్పాటు చేసిన మోదీ నోట్ల రద్దుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్ కు హ్యాండ్

విధేయతే రాజకీయాల్లో అతి పెద్ద అర్హత.. అందుకే అస్మదీయులనుకునేవారిని నాయకులు ఏ పీఠమైనాఎక్కిస్తారు. తన పార్టీ వాడైనా తనవాడు కాకపోతే పాతాళానికి తొక్కేస్తారు. ఇదంతా రాజకీయ వైకుంఠపాళీలో కామన్ గా కనిపించే అంశం.

అయితే ప్రధాని మోదీ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశం గగ్గోలు పెడుతుండటం.. కేంద్రంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో మోదీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా ఐదుగురు ముఖ్యమంత్రులతో కూడిన ఒక ఉపసంఘాన్ని కూడా నియమించారు.అయితే ఈ సంఘానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అధ్యక్షుడిగా నియమించడం విశేషం.

పెద్ద నోట్ల రద్దుపై మొదట మోదీని ఆకాశానికి ఎత్తిన చంద్రబాబు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్ర వైఫల్యంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.అలాంటి బాబు ను ఉపసంఘం అధ్యక్షుడిగా నియమించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే మొదటి నుంచి మోదీ పెద్ద నోట్ల రద్దుపై పూర్తి మద్దతు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు కనీసం ఉప సంఘంలో చోటు కూడా ఇవ్వకపోవడం.

నోట్ల రద్దు తర్వాత మోదీగా అండగా నిలబడిన అతి కొద్దిమంది సీఎంలలో కేసీఆర్ ఒకరు. దీంతో గతంలో కేసీఆర్ ను మోదీ స్వయంగా ఢిల్లీకి ఆహ్వానించి నోట్ల రద్దుపై చర్చించారు కూడా. అంతేకాకుండా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు శంషాబాద్ ఏయిర్ పోర్టులో కూడా మోదీ.. సీఎం కేసీఆర్ తో ఇదే విషయమై చర్చించన్నట్లు సమాచారం.

ఒక వైపు ఎన్డీయే మిత్రపక్షాలే మోదీ ప్రకటనపై విమర్శలు గుప్పిస్తూ ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతుంటే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్డీయే లో లేకున్నా.. మోదీకి అండగా నిలబడ్డారు. అయినా నోట్ల రద్దు ఉపసంఘంలో మోదీ ఆయనను కనీసం సభ్యుడిగా కూడా చేర్చుకోకపోవడం గమనార్హం.