తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ

First Published 2, Apr 2018, 1:36 PM IST
new political party enters in telangana politics
Highlights
పార్టీ పేరు, కార్యాచరణ ప్రకటించిన కోదండరాం

తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన  పార్టీ ఆవిర్భవించింది. ఎన్నో రోజుల నుంచి తెలంగాణ జేఏసి అద్యక్షుడు కోదండరాం నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, జేఏసి నాయకులతో చర్చించిన కోదండరాం ఎట్టకేలకు పార్టీ పేరును ప్రకటించారు. తెలంగాణ జనసమితిగా పార్టీ పేరును ఖరారు చేసినట్లు లక్డీకపూల్ సెంట్రల్ కోర్ట్ హోటల్లో జరిగిన సమావేశంలో కోదండరాం ప్రకటించారు. ఈ పార్టీ అద్యక్షుడిగా తాను చాలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. 

పార్టీ ప్రకటన అనంతరం కోదండరాం మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీపై, ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. దేనికోసమైతే ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామో దాని కోసం ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని మండిపడ్డారు. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్దంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రత్యేక రాష్ట్రంలో ఏ వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించామో ఆ వర్గాలకు న్యాయం జరగలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అలాగే ట్రాక్టర్ల పంపిణీలోనూ వివక్ష చూపిస్తున్నారని, గొర్రెల పంపిణీ కీ లాట్రి తీసినట్లే, ట్రాక్టర్ల పంపిణీ కి కూడా లాట్రీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. రాష్ట్రంలో మహిళా వివక్షత కూడా ఎక్కువయిందని అందుకు నిదర్శనం క్యాబినెట్ లో మహిళలకు చోటు దక్కకపోవడమేనని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, సొంత రాష్ట్రంలో యాత్రలు చేయాలంటె కూడా కోర్టు కు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ జేఏసీ స్వతంత్రంగానే ఉంటుందని, జేఏసీ వెలుపల పార్టీ వ్యవహారాలు నడుస్తాయని కోదండరాం తెలిపారు. తెలంగాణ అభివృద్ధి. సామాజిక న్యాయం, దిశగా పార్టీ విధానాలు ఉంటాయన్నారు.   ఈ నెల 4న పార్టీ జెండా ను ఆవిష్కరించనున్నట్లు, ఎప్రిల్ 29 న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిసంచనున్నట్లు ప్రకటించారు.ఈ సభ కోసం 12 సబ్ కమిటీలు పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి బహిరంగ సభకు సన్నాహక కార్యక్రమాలలో భాగంగా జిల్లా, గ్రామ స్దాయిలో సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కోదండరాం తెలిపారు. 

loader