ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎందుకు వ్యతిరేకించారో అధికారంలోకి రాగానే వాటినే ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని మోడిని నిలదీస్తున్నట్లుగా ప్రశ్నలు ఉన్నాయి.
పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో పలువురు నెటిజన్లు ప్రధానమంత్రి నరేంద్రమోడికి కొన్నిప్రశ్నలు సంధిస్తున్నారు. అందులో 2004-2014 మధ్య యూపిఏ ప్రభుత్వం హయాంలో జరిగిన పరిణామాలను కూడా ప్రస్తావించారు. సదరు పరిణామాల పట్ల అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన విధానం, చేసిన ఆక్షేపణలను నెటిజన్లు ప్రస్తావించటం గమనార్హం.
అప్పట్లో వ్యతిరేకించిన వాటిల్లో కొన్నింటిని అధికారంలోకి రాగానే అదే భాజపా ఇపుడు అమలు చేస్తుండటాన్ని మోడికి గుర్తుచేసారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎందుకు వ్యతిరేకించారో అధికారంలోకి రాగానే వాటినే ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని మోడిని నిలదీస్తున్నట్లుగా ప్రశ్నలు ఉన్నాయి. ఆశక్తిగా ఉన్న ప్రశ్నలను మీరు చదవండి
1. 2014లో యూపిఏ ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించినపుడు వ్యతిరేకించారు?
రూపాయి విలువను తగ్గించటాన్నే వ్యతిరేకించిన మీరు 2016లో కరెన్సీ రద్దు ఎలా చేశారు?
2. 2013లో కందిపప్పు ధర పెరిగితే దేశవ్యాప్త ఆందోళన చేశారు.
2016లో మీ హయాంలోనే కందిపప్పు కిలో రూ.200కు పైగా పెరిగిన సంగతి తెలుసా?
3. మీ పార్టీ గో హత్యను వ్యతిరేకిస్తున్నది.
మీ హయాంలోనే బీఫ్ ఎగుమతిలో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఎలా చేరుకుందని అడగటం విశేషం.
4. మన్మోహన్‌సింగ్, నవాజ్ షరీఫ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తేనే విమర్శించారు.
పిలువకుండానే మీరు షరీఫ్ జన్మదినానికి వెళ్లి కేక్ ఎందుకు తిన్నారు?
5. గతంలో ఎఫ్‌డీఐ, జీఎస్‌టీ, ఆధార్‌ని విమర్శించారు.
ప్రస్తుతం వాటిని ఎందుకు మీరు అమలు చేస్తున్నారు?
6. 'నిర్భయ' ఘటనపై గతంలో మూడు నెలలపాటు ఆందోళన చేశారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ప్రతిరోజూ 12 లైంగికదాడులు,ఢిల్లీలో ఏడు లైంగికదాడులు జరుగుతున్నా మీరు ఎందుకు చప్పుడు చేయడం లేదు?
7. 2004-2014 మధ్యలో రైల్వే చార్జీలు పెరిగితే ఆందోళన చేశారు.
మీ హయాంలో రెండు సంవత్సరాల్లోనే 40 శాతం మేర చార్జీలు ఎందుకు పెరిగాయి?
8. యూపీఏ కాలంలో ప్రపంచంలో పెట్రోలు బ్యారల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా సార్లు ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించారు.
రెండున్నరేళ్లలో పెట్రోలు బ్యారల్ ధర భారీగా పడిపోయినప్పటికీ లీటరు పెట్రోలు ధర రూ.70కి ఎందుకు అమ్ముతున్నారు?
9. బీజేపీ ముఖ్యమంత్రులైన శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజ్యంలో వ్యాపం స్కాం, వసుంధరరాజే హయాంలో లలిత్ మోడీ స్కాం, 34 వేల కోట్ల అన్న వితరణ స్కాంలు జరిగినా వారి రాజీనామాలు మీరు కోరలేదు.
ఇతర పార్టీల పాలనలో ఇలాంటివి జరిగితే మాత్రం మీరు వెంటనే వారి రాజీనామాకు ఎలా డిమాండ్ చేస్తారు?
10. మీరు 24 గంటలు పని చేస్తున్నారని మీ భక్తులు చెబుతారు.
రెండున్నరేండ్ల కాలంలో దేశంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదెందుకు?
11. 100 రోజుల్లో విదేశాల్లో దాచి ఉంచిన నల్లధనం తెస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసారు.
మరి అధికారంలోకి వచ్చి 700 రోజులు దాటినా దానిపై ఏ విధమైన పురోగతి సాధించలేదెందుకు?
12. రైతుల ఉత్పత్తి పైన 50 శాతం లాభం ఇస్తానని హామీనిచ్చారు.
గడిచిన రెండేండ్లలో ఒక్క రూపాయి అయినా పెంచారా?
