Asianet News TeluguAsianet News Telugu

బాహుబలికి సై... మిర్చిపంటకు నై

రాజకీయనాయకుల ద్వంద్వ వైఖరిపై సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సెటైర్ ఇది. రైతన్న పండించిన మిర్చికీ గిట్టుబాటు ధర కల్పించని పాలకులు బాహుబలి సినిమాకు మాత్రం రాయితీలు ప్రకటించడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. వారి ఆక్రోషాన్ని ఇలా వెల్లగక్కుతున్నారు.

netizens criticise Political leaders double standard goes viral

అది సచివాలయం... ఒక బెంజ్ కార్ వచ్చి ఆగింది. ముగ్గురు వ్యక్తులు దిగి నడుచుకుంటూ ఒక బ్లాకు దగ్గరికి వెళ్లారు, బయట పీఏ ఉన్నాడు.

 

సర్, ఉన్నారా?

 

ఆ. .ఉన్నారు, మీరెవరు?

 

 మేము సినిమా  నిర్మాతలం, సర్ అపోయింట్ మెంట్ ఉంది ఇప్పుడు..

 

అలాగా, ఒక్క నిమిషం అని లోపలికెళ్లి, వెంటనే బయటకి వచ్చి " వెళ్ళండి సర్" అన్నాడు

 

ముగ్గురూ లోపలికెళ్లి, నిలబడి..

 

నమస్తే సర్

ఆ ఆ కూర్చోండి, ఏంటి విషయం?

ఏం లేదు సర్, వందల కోట్లు పెట్టి సినిమా తీసాం, అది మీకు తెలిసిందే...అంటూ, కూర్చుని..

వాటిని రికవరీ చేసుకోవాలంటే చాలా కష్టం , మీరు సాయం చేస్తే...

నేనేం చేయగలనయ్యా...

ఇప్పటికే మన మీడియా పైసా ఖర్చు లేకుండా వంద కోట్లకు సరిపడా పబ్లిసిటీ ఇచ్చారు, అయినా ఇప్పుడున్న రేట్లకు మాకు నష్టం వస్తుంది, 200..500 రూపాయలు పెట్టుకుంటే మాకు గిట్టు బాటు అవుతుంది, మీరు పర్మిషన్ ఇస్తే.....

అంత రేట్లు పెట్టి జనాలు చూస్తారా?

చూస్తారు సర్, అమ్మా, నాన్నలని వేదించొ, అప్పు చేసో, చివరికి అడక్కు తిని అయినా డబ్బులు తెచ్చుకుంటారు, ఆ సంగతి మేము, మీడియా చూసుకుంటాం

మరి మేధావులు ఒప్పుకుంటారా? గోల చెయ్యరూ?

ఎవరూ నోరు మెదపరు సర్, రాష్రంలో ఇన్ని జరుగుతున్నాయి, ఎవరైనా నోరెత్తారా?

ఊ... సరే వచ్చే డబ్బులతో ఏమైనా జనాలకు ఉపయోగపడే పనులు చేస్తారా?

ఊరుకోండి సర్, కావాలంటే పార్టీ ఫండ్ లాంటివి ఇస్తాం

సరేనయ్య...రేట్లు పెంచుకోవచ్చని ఆఫిషల్ గా జీవో పాస్ చేస్తాం, ఇక వెళ్ళండి

 

థాంక్ యూ సర్ అని ముగ్గురూ బయటికి వచ్చారు. అప్పటికే ఏదో ఆలోచిస్తూ ఉన్న పీఏ..

సార్, మీరు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అని లోపల మాట్లాడుతుంటే తెలిసింది, రిలీజ్ రోజు మా ఫ్యామిలీకి ఆరు టికెట్స్ కావాలి, మా వాడు అయితే నిద్రలో కూడా మీ సినిమానే కలవరిస్తున్నాడు..

సరేనయ్య ఐమాక్స్ లో ఆరెంజ్ చేస్తా అని , కారెక్కి వెళ్లిపోయారు. పీయే కళ్ళు పరవశంతో పావనమైపోయాయి

 

రెండురోజుల తర్వాత.........

 

 దూరంగా ఒక ఆటోలోంచి ఆరుగురు వ్యక్తులు దిగి ,అదే బ్లాకు ముందుకి వచ్చారు.

 

ఇక రెండు రోజుల్లో సినిమా రిలీజ్, ఆయన్ని..ఈయన ఎందుకు చంపాడో తెలిసి పోతున్నందుకు మురుసిపోతున్న పీఏ, వాళ్ళని చూసి..

 

ఏయ్, ఎవరు మీరు?

మేము అనంతపురం రైతులం, అయ్యగారిని కలవాల సారూ

 

రైతులా, ఊ..తెలుస్తుందిలే, ఏం కావాలి,అయినా సర్ బిజీగా ఉన్నారు, ఎవర్నీ కలవరు.

అట్లా అనకండి అయ్యా, పంటలన్నీ ఎండిపోయాయి, పండిన వాటికి సరైన ధర రావట్లేదు. కాస్త అయ్యగారు గిట్టుబాటు ధర కల్పిస్తారేమో అని....

చూడండి, ఎన్నో ఏళ్ళ నుండి చూస్తున్నా, మీ రైతులకు ఎవ్వరి మద్దతు ఉండదు, మద్దతు దరా ఉండదు, అయినా మంత్రి గారు మొన్నే చెప్పారు కదా గిట్టు బాటు ధర కుదరదని....

 

అందుకే కదా సర్ ని కలుద్దామని వచ్చాము! ఎవరూ మా సమస్యలను పట్టించుకోట్లేదు. మీడియా వాళ్లేమో మేము చస్తే గాని రారు. వాళ్లకి ఎప్పుడూ సంచలనాలు కావాలి. అదేదో బికినీ అంట, ఎవత్తో వేసుకుంటుందంట ... అది వాళ్లకి వార్త. రైతు ఉరేసుకుంటే మాత్రం వార్త కాదు. ప్రతిపక్షాలు ఎప్పుడో రాద్ధాంతం చేస్తాయి కానీ ఎవరూ పట్టించుకోరు.మద్దతు ఇవ్వమని విద్యార్థులని అడిగితే .. వారు సినిమాలు, క్రికెట్ అంటారు.పోనీ సినిమా వాళ్ళని అడిగితే...మేమొస్తే శాంతి భద్రతల సమస్య అంటారు. మాకు న్యాయం చేయండి ప్రభో అని రోడ్డెక్కితే ..చిల్లర దొంగలను కొట్టినట్లు కొడుతున్నారు పోలీసులు.ఇంకెవరు మాకు దిక్కు ? అంటుంటే, అటు వైపు వ్యవసాయశాఖ మంత్రి వెళ్తున్నారు. ఆయన్ని చూసి రైతులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. మంత్రి గారి ఎదురుగా నిలబడి ...

 

అయ్యా, మేము...

 

ఆ ... అవతారాలు చుస్తే అర్ధం అవుతుందిలే, సరేగాని ఈడకెందుకొచ్చారు? ఎన్ని సార్లు చెప్పాలయ్యా మీకు? మీరు ధరలు పెంచితే జనాలు ఊరుకోరు, ఎవ్వరూ కొనరు, మేధావులు ఖండిస్తారు. అయినా మేము సింగపూర్ చేస్తాం, పారిస్ చేస్తాం అంటుంటే..మీరెందయ్యా ఇంకా పంటలూ, పొలాలు, మట్టి, మద్దతు ధర అంటారు? ఏమయ్యా మీ వల్ల సమాజానికి ఉపయోగం?

 

అవును సర్, మా వాళ్ళ ఏం ప్రయోజనం ? అందుకే సంవత్సరానికి వేలల్లో చనిపోతున్నాం. అయ్యా ఒకటి గుర్తు పెట్టుకోండి " పదిమందిని పాలించేది రాజు అయితే, పదిమందికి అన్నం పెట్టేవాడు రైతు". అలాంటి రైతులం సచ్చిపోతున్నాం అయ్యా, కాస్త కరుణించండయ్యా...

 

చస్తే చావండి, ఇంకోసారి ఇక్కడ కనబడ్డారంటే.... ఏయ్ పోలీసులను పిలిచి వీళ్ళని తోలేయ్యండి,ఎదవ నస అని మంత్రి గారు ఆజ్ఞాపించారు. అందుకే కదా మేముంది అన్నట్లు టపా టపా వచ్చేసారు పోలీసులు. వాళ్ళని చూడగానే ఒంటి మీద పాత గాయాలు గుర్తొచ్చి ,

 

వద్దులే సర్, మేమె పోతున్నాం " రేయ్, రైతు లేకపోతే...పంట పండదు,అన్నం ఉండదు, చివరికి మీ జీవితమే మిగలదు" ఎప్పుడు తెలుసుకుంటార్రా? అనుకుంటూ...ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ.. చావును వెతుక్కుంటూ... మన రైతన్నలు.

Follow Us:
Download App:
  • android
  • ios