గన్ మెన్ లకు వెనక్కి పంపిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

గన్ మెన్ లకు వెనక్కి పంపిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇద్దరు గన్ మెన్ లను వెనక్కి పంపించేశారు. శ్రీధర్ రెడ్డి గత 59 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా..  ఆయన రక్షణ నిమిత్తం ఇద్దరు గన్ మెన్ లను ప్రభుత్వం నియమించింది. కాగా.. వారి రక్షణ తనకు అవసరం లేదంటూ వారిని ఎమ్మెల్యే వెనక్కి పంపించేశారు. ఆయన ఎమ్మెల్యేగా  నియమితులైన సమయంలోనే ఆయనకు ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్ లను నియమించగా... వారిని ఎమ్మెల్యే వెనక్కి పంపించారు. అయితే.. పాదయాత్ర సమయంలోనే ఆయనకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం మరోసారి గన్ మెన్ లకు నియమించింది. కాగా.. యధా ప్రకారం శ్రీధర్ రెడ్డి వారిని వెనక్కి పంపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తన రక్షణ కోసం పోలీసులు గన్ మెన్ లని ఏర్పాటు చేసినందుకు దన్యవాదాలు తెలిపారు. అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కార్యకర్తలు, కంటికి రెప్పలా కాపాడుకునే స్నేహితులు, కుటుంబసభ్యుడిలా ఆదరించే నియోజకవర్గ ప్రజలు ఉండగా తనకు గన్ మెన్ ల అవసరం లేదన్నారు. ఇంటిలిజెన్స్ నివేదిక ప్రకారం ఒక వేళ జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత తనదేనని, ఇందులో పోలీసులకు ఎలాంటి బాధ్యత లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డిజీపీకి, ఇంటిలిజెన్స్ ఐజీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరిలో ఒకటిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గన్ మెన్లు తీసుకోని ఏకైక ఎమ్మెల్యే మా శ్రీధర్ రెడ్డి అని ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తాను ఒమ్ముచేయనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos