సంక్రాంతి పండగ పూట నెల్లూరు జిల్లాలో విషాద చాయలు అలుముకున్నాయి. జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ వద్ద గల జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు.

ఇవాళ ఉదయం కురిసిన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ పొగమంచు వల్ల రోడ్డు పక్కన ఆగివున్న లారీని గమనించని కారులోని వారు వేగంగా వచ్చి ఢీకొనడంతో  ఈ ప్రమాదం సంభవించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా టీపీ గూడూరు వాసులుగా గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.