పెదాల పగుళ్లకు చెక్ పెట్టండి..!

First Published 1, Dec 2017, 5:42 PM IST
Natural Ways To Get Smooth Lips in Winters
Highlights
  • పెదాలు పగళ్లు  లేకుండా ఎర్రగా , అందంగా ఉంటే.. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించవచ్చు.
  • మరి ఆ పెదాలు అందంగా ఉండాలంటే  ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..

మనిషి ముఖం చూడగానే.. మొదట ఎవరినైనా ఆకర్షించేవి పెదాలే. అలాంటి పెదాలు.. అంద విహీనంగా, పగిలిపోయి ఉంటే.. మీరు ఎంత అందంగా ఉన్నా.. లాభం ఉండదు. అదే పెదాలు పగళ్లు  లేకుండా ఎర్రగా , అందంగా ఉంటే.. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించవచ్చు. మరి ఆ పెదాలు అందంగా ఉండాలంటే  ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా మన శరీరంలోని తేమ శాతం ఎక్కువగా ఉంటే.. పెదాలు పగలడం లాంటివి జరగవు. ఎండాకాలం మనం వద్దనుకున్నా సరే.. దాహం వేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో నీరు తాగేస్తాం. సో.. ఆ సమయంలో తేమశాతం ఎక్కువగా ఉండి.. పెదాలు పగలవు. మరి వర్షాకాలం, చలికాలం పరిస్థితి ఏమిటి..? మనం ఎంత తాగుదామనుకున్నా కూడా.. వాతారణం సహకరించదు. దీంతో.. శరీరంలో తేమ శాతం తగ్గిపోయి.. పెదాలు పగులుతుంటాయి. అందుకే చాలా మంది చలికాలంలో కచ్చితంగా లిప్ బామ్ వాడుతుంటారు. లిమ్ బామ్ వాడితే.. పెదాల పగళ్లు తగ్గుతాయి.. కానీ వాటిల్లో కెమికల్స్ ఉంటాయి కదా. వాటితో మరింత ప్రాబ్లమ్ కదా..? మరి ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నారా.. మన ఇంట్లో లభించే వస్తువులతోనే పెదాల పగుళ్లని తగ్గించుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్.. ఆలివ్ ఆయిల్ మనకు మార్కెట్ లో చాలా సులభంగా లభిస్తుంది. ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి దీనితో పెదాల పగుళ్లకి చెక్ చెప్పవచ్చు. ఈ ఆలివ్ ఆయిల్ లో తేనె కలిపి.. పెదాలపై సున్నితంగా మసాజ్ చేయాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే పెదాల పగలడం తగ్గి అందంగా తయారౌతాయి. ఈ మిశ్రమాన్ని కావాలంటే ముందుగానే తయారు చేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది నేచురల్ లిప్ బామ్ గా పనిచేస్తుంది.

షుగర్... పంచదార.. ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉంటుంది. దీనితో కూడా పగిలిన పెదాలను అందంగా చేయవచ్చు. పంచదార నేచురల్ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది. దీనితో పగిలిన పెదాలను రుద్దితే.. డెడ్ సెల్స్ పోయి.. లిప్స్ స్మూత్ గా తయారౌతాయి. ఈ పంచదారలో జోజోబా ఆయిల్ కలిపి సున్నితంగా మసాజ్ చేయాలి. ఓ పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

తేనె.. పెదాల పగుళ్లకు చక్కని పరిష్కారం తేనె. దీనిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది డెడ్ సెల్స్ ని పోగొడుతుంది. తేనెలో నిమ్మరసం, లేదా పంచదార, లేదా గ్లిసరిన్.. ఏదో ఒకటి కలుపుకొని పెదాలపై మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పాలు.. పాలు తాగితే బలం అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ బీ12, విటమిన్ బీ2లు ఉంటాయి. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా పాలు బాగా ఉపయోగపడతాయి. పాలల్లో కొద్దిగా పసుపు కలిపి పేస్టులాగా చేసుకొని దానిని పెదాలకు అప్లై చేయాలి. సున్నితంగా మసాజ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే.. తేడా మీరే గమనిస్తారు.

బీట్ రూట్.. బీట్ రూట్ చిన్న ముక్కని తీసుకొని.. దానిని పెదాలపై కొద్దిసేపు రుద్దితే.. పగుళ్లు తగ్గడమే కాదు.. నేచురల్ రోజీ కలర్ లో మెరిసిపోతాయి.

టమాట జ్యూస్.. పెదాల పగుళ్లకు టమాట రసం కూడా చక్కటి పరిష్కారం చూపుతుంది. ఇందులో విటమిన్ సి, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి స్కిన్ సెల్స్ డ్యామేజ్ తగ్గిస్తాయి. టమాట రసాన్ని పెదాలపై సున్నితంగా రుద్ది.. 15 నిమిషాలపాటు వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడిగితే.. ఫలితం మీకే తెలుస్తుంది.

 

loader