నిరుద్యోగ భృతి కి ఎగనామం

naidus unemployed allowance scheme unlikely to take off
Highlights

  • నిరుద్యోగ భృతి ఎగ్గొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం యత్నాలు
  • ‘జాబు రావాలంటే బాబు రావాలి’ దారిలోనే నిరుద్యోగ భృతి

 ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తానన్న ‘‘నిరుద్యోగ భృతి’’ ఇక ఇవ్వనట్టేనా..? నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందా..? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే... నిరుద్యోగభృతి ఇవ్వటమన్నది పోయిన ఎన్నికల్లో  చంద్రబాబునాయుడు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి. అయితే, అధికారంలోకి రాగానే తన హామీని చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టేసారు. అయితే, ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసిన నిరుద్యోగులు చివరకు ఆందోళనలకు దిగారు. దానికితోడు వైసిపి కూడా అదే విషయమై పదే పదే అధికారపార్టీపై దాడులు చేస్తోంది.

వీటికి తోడు 2019 ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దాంతో నిరుద్యోగభృతిని అమలు చేయక తప్పని పరిస్ధితిలు ఏర్పడ్డాయి. అందుకని ఈ విషయమై చంద్రబాబు కూడా దృష్టి పెట్టారు. ఓ కమిటినీ వేసి అధ్యయనం చేయించారు. మొత్తానికి సుమారు 12 లక్షల మందికి నిరుద్యోగ భృతిని అమలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు. ఇక 2018 సంక్రాంతి నుంచి నిరుద్యోగ భృతి అందినట్టే అని అందరూ భావించారు. అయితే.. టీడీపీ ప్రభుత్వం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మళ్లీ కథను అడ్డం తిప్పింది.

సంక్రాంతి రావడం అయ్యింది.. వెళ్లిపోవడం అయిందీ.. కానీ నిరుద్యోగ భృతి గురించి మాత్రం ఒక్క మాట మాట్లడట్లేదు. ఇందుకు ఓ మాష్టర్ ప్లానే వేశాడు చంద్రబాబు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు భృతి కాకుండా.. వారికి పలు రంగాల్లో శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. శిక్షణ తర్వాత వారికి ఉద్యోగం వస్తే.. ఇక భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ చైనా కేంద్రంగా నడిచే ఆలీబాబా.కామ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారనమాట. ఈ ఆలోచన బాగానే ఉంది.. కానీ ఇది నిజంగా అమలౌతుందా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. ఎందుకంటే.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా సరిగా అమలు కాలేదు. అందుకే దీనిపైనా సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

loader