శని, ఆదివారాల్లో సైతం మనవణ్ణి చూడ్డానికి హైదరాబాద్ పోకుండా అమరావతి బ్రాండింగ్ కోసం ఇక్కడే వుంటున్నాను.రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా పనులు జరగాలి.పోలవరం లాగా అమరావతి నగర నిర్మాణం కూడా ప్రజలకు కనిపించాలి.
అమరావతి కోసం సొంతమనవణ్ని కూడా చూడలేకపోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
అమరావతి కోసం తాను ఎంత పరితపిస్తున్నది చెబుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
’’శని, ఆదివారాల్లో సైతం తాను మనవణ్ణి చూడ్డానికి హైదరాబాద్ పోకుండా అమరావతి బ్రాండింగ్ కోసం ఇక్కడే వుంటున్నాను,’’ అని ఆయన అమరావతి సిఆర్ డి ఎ అధికారులతో జరిగిన ఒకసమావేశంలో అన్నారు.
శంకుస్థాపన జరిగి రెండేళ్లువుతన్నా ఇటుకపడని విషయాన్ని ఆయన పరోక్షంగా అంగీకరించారు. అమరావతి కనిపించడం లేదని కూడా అన్నారు,.
‘యావత్ ఆంధ్రప్రదేశ్ ఆశ, శ్వాసగా భావిస్తున్న అమరావతి నిర్మాణం కళ్ల ముందు కనిపించాలి. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా పనులు జరగాలి’-అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా అయితే కళ్ల ముందు కనిపిస్తున్నాయో అమరావతి నగర నిర్మాణం కూడా ప్రజలకు కనిపించాలని అన్నారు.
అమరావతి కోసం ఇంకా భూసమీకరణ జరపాలని అధికారులు చెప్పారు. మలి విడత పూలింగ్‌లో 14 వేల ఎకరాల భూ సమీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి వివరించారు.
అంతర్జాతీయ విద్యాలయాలు, స్టార్ హోటళ్ల కోసం బిడ్డింగ్ పద్దతి కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన 15 సంస్థలతో సంప్రదింపులు జరిపి వారు అమరావతికి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీలోని ఏ విద్యార్ధి కూడా విదేశాలకు వెళ్లి విద్యనభ్యసించాల్సిన అవసరం రాని విధంగా ప్రపంచ ప్రమాణాలు కలిగిన అంతర్జాతీయ విద్యాలయాలన్నీ ఇక్కడ కొలువు తీరేలా చూడాలన్నారు.
