రాయలసీమకు తరలనున్న తల్లి గోదావరి

First Published 15, Dec 2017, 1:14 PM IST
Naidu plannint to take Godavari water to Rayalaseema
Highlights

ఇంతవరకు రాయలసీమకు కృష్ణా జలాలే విన్నాం. ఇపుడు గోదావరి జలాలూ సీమను తాకనున్నాయి.

ఇంతవరకు రాయలసీమ కు కృష్ణా జలాల తరలిపుంపు గురించే ామాట్లాడుకున్నాం. ఇపుడు  ఆ వెనకబడిన ప్రాంతం నీటి వెతలు తీర్చేందుకు ఒక బృహత్ ప్రణాళిక సిద్ధమవుతున్నది. అది రాయలసీమకు గోదావరి జలాలను తరలించడం. ఇది ఒక అసాధారణమయిన నిర్ణయమని అధికారులు చెబుతున్నారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటున్నదని, ఇది రాయలసీమస్వరూపాన్ని పూర్తిగా మార్చి వేస్తుందని ఒక అధికారి‘ ఏషియానెట్’కు చెప్పారు. వివరాలు ఇవి :

గోదావరి వరద నీటిని పెన్నాకు తరలించేందుకు సంబంధించిన ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు నీరు, సాగు నీరు, పరిశ్రమలకు నీరు సమృద్ధిగా అందుతుంది. ఆరు జిల్లాల్లోని పట్టణాలకు, గ్రామాల్లోని చెరువులకు, ఇతర రిజర్వాయర్లకు గోదావరి మిగులు జలాలు తరలించాలన్నది ముఖ్యమంత్రి దృఢ సంకల్పం.

 

గోదావరి-పెన్నా అనుసంధానంపై ముఖ్యమంత్రికి వాప్‌కాస్ లిమిటెడ్ సవివర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) ను సమర్పించింది. మొత్తం 320 టీఎంసీల గోదావరి మిగులు జలాలను పెన్నాకు తరలించే వీలుందని ముఖ్యమంత్రికి వాప్‌కాస్ ప్రతినిధులు వివరించారు. గోదావరి-పెన్నాఅనుసంధానానికి 7 వేల ఎకరాల అటవీ భూమి, 25 వేల ఎకరాల ఇతర భూములను సేకరించాల్సి వుంటుంది.గోదావరి-పెన్నా అనుసంధానానికి రూ. 80 వేల కోట్ల వ్యయం కానుందని అంచనా. 320 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా తరలించేందుకు 3,625 మెగావాట్ల విద్యుత్ అవసరం. గోదావరి-పెన్నా అనుసంధానం ప్రాజెక్టులో ఇప్పటికే లైడార్, హైడ్రోగ్రాఫిక్ సర్వే  పూర్తయింది. ఇపుడు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.ఈనెల 23న రాష్ట్రానికి వస్తున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గోదావరి-పెన్నా అనుసంధానంపై గడ్కరీకి సవివర ప్రజంటేషన్ సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

అంతేకాదు,

పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ. దిగువున, ప్రకాశం బ్యారేజ్‌కు 23 కి.మీ ఎగువున కొత్తగా బ్యారేజ్ నిర్మించే యోచనకూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు.వైకుంఠపురం దగ్గర కృష్ణా నదిపై బ్యారేజ్ నిర్మాణాని ఏర్పాట్లు. దీనికి   రూ. 3,278.60 కోట్లు వ్యయం కానుందని అంచనా. బ్యారేజ్ నిర్మాణానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది.వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కొమ్మమూరు కాలువ మీదుగా  పెదగంజాంకు, అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు, ఆ తర్వాత సంగం బ్యారేజ్‌కు తరలించడపై అధికారులతో  ముఖ్యమంత్రి చర్చించారు.

 

 

loader