ఆలయ అర్చకత్వం మీద వారసత్వ హక్కు లిచ్చినందుకుముఖ్యమంత్రి చంద్రబాబుకు  ’బ్రాహ్మణ బంధు’  బిరుదు 


 దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే అర్చకులకు వారసత్వ హక్కును కల్పించి, వారి వయో పరిమితిని రద్దు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏపీ అర్చక సమాఖ్య కొనియాడింది.

ఆయన దీనిపై జీవో నెంబర్ 77ను జారీ చేయడం చారిత్రకమని పేర్కొంటూ, 30 ఏళ్లుగా పోరాడుతున్న తమకు న్యాయం చేసినందుకు అర్చక సమాఖ్య ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘బ్రాహ్మణ బంధు’ అనే బిరుదు బహూకరించారు.


సోమవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అర్చక సమాఖ్య ప్రతినిధులు-వారసత్వ హక్కుతో హిందూ ధర్మాన్ని పరిరక్షించడమే కాకుండా 40 వేల పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకున్నారంటూ ఆయన్ని వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం అందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యుల పేరున రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రతినిత్యం అర్చన జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు.


1997లో దేవాదాయ శాఖ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదేనని అర్చక సమాఖ్య ప్రతినిధులు అన్నారు. పేద బ్రాహ్మణులు ఇల్లు కట్టుకునేందుకు, ఉపనయనానికి, వైద్యానికి ఇలా అన్నివిధాలా సాయం చేస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, ఇందుకు సర్వదా రుణపడి వుంటామని అన్నారు. 


బ్రాహ్మణులలో పేదరిక నిర్మూలన కోసమే దేశంలో ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారికి గుర్తు చేశారు. అందరి మత విశ్వాసాలను తాను గౌరవిస్తానని, ప్రతి ఒక్కరు పరమత సహనం పాటించాలని చెప్పారు. దైవ చింతనతో మనలో అంత:శక్తి పెంపొందుతుందని, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని అన్నారు. బ్రాహ్మణులకు తమ ప్రభుత్వం నుంచి నిరంతరం చేయూత వుంటుందని, మిగిలిన సమస్యలు పరిష్కరిస్తామని అర్చక సమాఖ్య ప్రతినిధులకు హామీ ఇచ్చారు.