Asianet News TeluguAsianet News Telugu

అమరావతి ఆకారం: వజ్రం మాదిరి అసెంబ్లీ... స్థూపం లాగా హైకోర్టు

  • అమరావతి పాలనా నగరం డిజైన్లు ఖరారు
  • వజ్రాకృతిలో అసెంబ్లీ... స్థూపాకారంలో హైకోర్టు
  • సిటీ  స్క్వేర్ నుంచి సిఎం, గవర్నర్ నివాసాల తొలగింపు
  • సిటీ  స్క్వేర్  అన్ని దొరికే వ్యాపార కేంద్రంగా మాత్రమే ఉండాలి

 

Naidu finalizes the design for administrative city of amaravati

 

రాష్ట్ర శాసన పరిషత్ (శాసనసభ, శాసనమండలి) సముదాయ నిర్మాణానికి వజ్రాకృతిలో ఉన్న డిజైన్‌ను ఎంపికచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించనున్న హైకోర్టు భవనానికి స్థూపం ఆకారం ఎంపికచేశారు. దీనిని వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చూపించారు.అమరావతిలోని పరిపాలన నగరానికి డిజైన్ రూపొందిస్తున్న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ బుధవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శాసనపరిషత్  హైకోర్టు భవనాలకు సంబంధించిన సవివర ఆకృతులను ప్రదర్శించారు.

 

తొలుత హైకోర్టు కోసం నార్మన్ ఫోస్టర్స్ సిద్ధం చేసిన వజ్రాకార భవన ఆకృతిని ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించారు. శాసనసభ కోసం రూపొందించిన బుద్ధ స్థూపం ఆకృతిని హైకోర్టు కోసం వినియోగించుకుందామని చెప్పారు.

 

 ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో విలువైన వజ్రాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని తమ అసెంబ్లీ భవన రూపంలో చూసుకుని సంతోషపడతారు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘స్థూపం సంతోషానికి చిహ్నం. న్యాయం జరిగినప్పుడే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కోర్టు గుమ్మం తొక్కిన ప్రతి వ్యక్తి స్థూపాకారంలో వున్న ఈ భవనాన్ని చూసి తనకు ఇక్కడ నిజమైన న్యాయం దక్కుతుందని భావించాలి’ అని అన్నారు.

 

అమరావతిలోని నవ నగరాల్లో భాగంగా నిర్మిస్తున్న న్యాయనగరం రానున్న కాలంలో హాంకాంగ్, లండన్ నగరాల్లా భాసిల్లాలన్నదే తన అభిలాష అని తెలిపారు. దీనికోసం నల్సర్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత సంస్థలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన లా ఏజెన్సీలను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ న్యాయవిద్య, న్యాయ సలహా అమరావతిలో తప్పక దొరుకుతుందనే భావన కలగాలన్నారు. 

 

ఇది సిఎంకు నచ్చలే...

 

 పరిపాలన నగరానికి కొనభాగాన, కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న ‘సిటీ స్క్వేర్’ అమరావతి నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ మేరకు సిటీ స్క్వేర్ ఆకృతులను రూపొందించాలని ఫోస్టర్స్ బృందానికి చెప్పారు. ముఖ్యమంత్రి, గవర్నర్ అధికారిక నివాసాలను సిటీ స్క్వేర్‌లో భాగంగా చెరోవైపు ఉండేలా ఫోస్టర్స్ బృందం డిజైన్ చేసింది. అయితే, ఇది ఆయనకు నచ్చ లేదు. వాటిని అక్కడి నుంచి మార్చాలని సూచించారు.

 

 సిటీ స్క్వేర్ లో రెస్టరెంట్స్, హోటల్స్, కెఫెటేరియా, షాపింగ్ మాల్స్, మూవీ ధియెటర్స్, స్పోర్ట్స్, రిక్రియేషన్ సెంటర్స్, కన్వెన్షన్ సెంటర్స్ కొలువుదీరాలని ఆయన చెప్పారు. సిటీ స్క్వేర్‌కు వెళితే అక్కడ సమస్తం ఉంటాయన్న భావన రాజధాని ప్రజలకు కలగాలన్నారు. దీన్ని ఎంత విశాలంగా  ఏర్పాటుచేస్తే అంత మంచిదని అందువల్ల సీయం, గవర్నర్ నివాసాలను అక్కడ తీసివేసి నదీతీరానికి మార్చాలని సూచించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios