ముస్లిం వోట్ల కోసం చంద్రబాబు తంటాలు వైశ్యుల్లోని బిజెపి నేతల గుర్రు వైశ్యులతో దౌత్యానికి టిజి వెంకటేశ్ బేరం  

నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు భారతీయ జనతాపార్టీని దూరంగా పెట్టారు. లోలోపల అనుకునేదేమంటే నంద్యాల ఎన్నికలపుడు బిజెపి ప్రస్తావన తీసుకురావద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా టిడిపి నేతలకు, ప్రచారం కోసం తిష్ట వేసిన మంత్రులకు, ఎమ్మల్యేలకు సూచనలిచ్చారట.

దీనికి కారణం, నంద్యాల ఎన్నికల్లోకి బిజెపి వస్తే, వ్యవహారం పాడవుతుందని నాయుడు భావించడమే నంటున్నారు. నంద్యాల ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గం. 2014 ఎన్నికలలో మూడు వేల పైచిలుకు వోట్లతో టిడిపి వోడిపోయింది. వైసిసి అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి గెల్చారు. తెలుగుదేశం వర్గం ఆలోచన ప్రకారం, ముస్లింలు అధికంగా జగన్ కు వోటేయడం వల్లే వైసిసికి మూడువేలదాకా మెజారిటి వచ్చింది. ఈ మార్జిన్ వోట్లను ముస్లింలనుంచి లాగేందుకు చంద్రబాబు నాయుడు ఎంచుకున్న వ్యూహంలో భాగంగానే బిజెపిని దూరంగా వుంచుతున్నారని తెలుగుదేశం నాయకుడొకరు చెప్పారు.అయితే, ఇది ఇపుడు బెడిసి కొట్టే ప్రమాదం ఉందని లోకల్ టిడిపి నేతులు భయపడుతున్నారు.

2014 నాటి లెక్కల ప్రకారం, ఒక్క నంద్యాల పట్టణంలోనే 33 శాతం(2011 సెన్సస్) ముస్లింలున్నారు. నియోజకవర్గానికి కచ్చితమయిన లెక్కలంటూ లేకపోయినా, 2014 ఎన్నికలపుడు 56 వేల మంది ముస్లిం వోటర్లున్నారని చెబుతున్నారు. మొత్తం నియోజకవర్గం వోటర్లు 1,74,999. ఇంత మంది ముస్లింలున్నపుడు వారితో శత్రుత్వం తెచ్చుకోవడం నాయుడికిష్టం లేదు.అందుకే వాళ్లని జాగ్రత్తగా దువ్వేందుకు ఇఫ్తార్ పార్టీ ఇచ్చాడు.పక్కన పడేసిన ఫరూక్ కు ఎమ్మెల్సీ ఇచ్చాడు. మరొక ముస్లిం నేత నౌమాన్ కు ఒక మంచి పదవి ఇచ్చాడు.

ముస్లింల తర్వాత ఇక్కడ మరొక బలమయిన వర్గం వైశ్యులు. వీళ్ల వోటర్లు 25000 దాకా ఉంటారని అంచనా. రాయలసీమలో వైశ్యులు ఎపుడూ బిజెపి వైపుంటారని పేరు. ఆర్ ఎస్ ఎస్ ను అభిమానిస్తారు. జిల్లా టిడిపి పదవిని సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు అప్పగించింది ఈ వర్గాన్ని దగ్గరయ్యేందుకే. రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ ని నంద్యాల బాగా తిరగమన్నది కూడా అందుకే.

ఇలా నరుక్కుంటూ వస్తున్నపుడు బిజెపి నాయకులొచ్చి, ప్రధాని మోదీ పేరు తీసుకువచ్చి, జాతిగీతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రెచ్చగొడితే, కొంతమంది వైశ్యులేమయినా ఇటొస్తారేమోగాని, ముస్లింలు దూరమవుతారని నాయుడి భయం. వీళ్లనుంచి మొత్తంగా కాకపోయినా కనీసం 10శాతం వోట్లొచ్చినా చాలు, టిడపి గెలుస్తుందని ఆయన పార్టీల నేతలకు చెప్పారట.

బిజెపిని కరివేపాకులాగా అవసరానికి వాడుకుంటున్నారని , ఈ ఎన్నికల్లో బిజెపిని ప్రచారానికి పిలకపోవడం చంద్రబాబు కుళ్లురాజకీయమని జిల్లా సీనియర్ బిజెపినేత ఒకరు ‘ఏషియానెట్’ కు చెప్పారు. బిజెపి నాయకుల కోపం ఎంత వరకు పోయిందంటే, వైశ్యులలో ఉన్న బిజెపి అభిమానులకు, అరెస్సెస్ వారికి వారు టిడిపి వోటేయండని చెప్పడం కుదరదని అనేశారు. దీనితో చంద్రబాబుకు చిక్కులు మొదలయ్యాయి. ఒక పదిశాతం ముస్లిం వోట్లు లాక్కున్నా, బిజెపి కోపం వల్ల వైశ్యుల వోట్లు పడకపోతే...

ఈ ప్రశ్న చంద్రబాబుని, టిడిపి ఎన్నికల మేనేజర్లను తెగ పీడిస్తున్నది.

దీనితోబాగా డబ్బున్న టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ ను రంగంలోకి దించి బిజెపికి చెందిన కుల పెద్దలతో మంతనాలడమని చెప్పారు. ఏవో హామీ లిచ్చి ఇలా స్థానిక వైశ్య బిజెపి మభ్యపెట్టడం బిజెపి సీనియర్లకు ఆగ్రహం తెప్పించింది. టిడిపి నేత మాదిరి పనిచేస్తారన్న విమర్శలున్న ఒక బిజెపి మంత్రిని చంద్రబాబు చాటు రంగంలోకి దించాడు. నంద్యాల బిజెపి నేతలతో ఇలా టిడిపి అధినేత రహస్య చర్చలు జరపతూండటంతో బిజెపి సీనియర్లు గుర్రగుర్రుగా ఉన్నారు. బిజెపి-టిడిపి అలయన్స్ కు గుడ్ బై చెబుదామని బిజెపి నాయకత్వం మీద వత్తిడి తెస్తున్న వారిలో రాయలసీమ బిజెపి నేతలు ముందున్న విషయం తెలిసిందే.

ఈ వ్యవహారమంతా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా తయారయిందని చెబుతున్నారు. దానికి తోడు వైశ్యులు వోట్లు తెస్తున్నానే పేరుతో 2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటు కొడుక్కు ఇవ్వాలని టిజి వెంకటేశ్ శ్రేష్టి బేరం పెట్టారట. ఆయన కుమారుడు అపుడే ‘నేనొస్తున్నా’ని కర్నూలులో ఫ్లెక్సిలు కూడా పెట్టారు.