దాదాపు 35 సంవత్సరాలపాటు ,అహర్నిశలు అధికారంలోకి ఎలా రావాలనే రాజకీయాలు నడిపిన వ్యక్తి, రాజకీయం మాట్లాడకుండా ఒక్క పూట వుండగలడా.  రాజకీయ ఉపవాసం ఉండటం చాలా కష్టం. ఎంతో భయమూ భక్తి ఉంటే తప్ప రాజకీయ ఉపవాసం పాటించడం సాధ్యం కాదు.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో  అదివారం నాడు రాజకీయ ఉపవాసం పాటించారు.

 

చాలా రోజుల తర్వాత, తెలంగాణా టిడిపి నేతల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన చాలా జాగ్రత్తగా... ఆచి తూచి ఉపన్యాసం ఇచ్చారు.  ఎంతయినా పరాయినేల కదా,  ఒక్క ముక్క రాజకీయం నోట దొర్లకుండా జాగ్రత్త పడ్డారు.

 

విదేశాలలో ఉన్నపుడు స్వదీశీ రాజకీయాలు మాట్లాడటం మీద ఎలా సంయమనం పాటిస్తారో,  ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా  తానేదో విదేశీ తెలంగాణా భూభాగం మీద ఉన్నట్లు, అక్కడ రాజకీయాలు మాట్లాడటం మర్యాద కాదన్నట్లు  తెలంగాణా పార్టీ నేతలతో మసలు కున్నారు.

 

ఆయనో జాతీయ పార్టీ అధ్యక్షుడు. ఆ హోదాలో ఆయన ఏ రాష్ట్రానికయినా వెళ్లి రాజకీయోపన్యాసం చేయవచ్చు.  బలమయిన  పార్టీ ఉండి, ముగ్గురే కావచ్చు కాక,  శాసన సభలో సభ్యత్వమూ ఉన్నా,  గత రెండున్నరేళ్లలో ఒక్కసారి కూడా తెలంగాణాను సందర్శించని జాతీయ నాయకుడు చంద్రబాబే. 

 

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా లో పర్యటించారు.టిఆర్ ఎస్ ప్రభుత్వవిధానాలను ఏకి పారేసి 2019లో అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని బిజెపి కార్యకర్తలను ఉత్తేజ పరుస్తున్నారు.

 

సిపిఎం జాతీయ నాయకుడు ఏచూరి కూడా పర్యటించారు. తెలంగాణా విధానలను విమర్శించారు. సిపిఐ  నాయకులు కూడా పలుమార్లు తెలంగాణా సందర్శించారు. తెలంగాణా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంతవరకు తెలంగాణాలో పర్యటించలేదు. ఆయన హైదరాబాద్ దాటిపోలేదు.  ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తెలంగాణాలో  పర్యటించడం లేదు.

 

అదివారం సమావేశంలో రాజకీయాలు తప్ప ఆయన చాలా పనికిరాని విషయాలు మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రంలో తన పార్టీ నేతలు  లెవనెత్తున్న సమస్యలను పేరు పెట్టి ప్రస్తావించడానికి కూడా ఆయన సాహిసించలేదు.

 

 నాయకులను ఉత్తేజ పరిచేందుకు ఆయన తరచూ పాడే  ‘సిగ్నేచర్ సాంగ్ ’ – హైటెక్ సిటీ నాది, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నాది, ఫైవోవర్లు నావి....- కూడా  పాడలేదు. 

 

మొదట్లో అబ్బడు, కొడుకు 2019 లో రెండు రాష్ట్రాలలో అధికారం మాదే అనే వారు.  ఈ మధ్య ఆ మాట అనడం మానేయడమే కాదు, అసలు తెలంగాణా వైపు చూడటమే లేదు.  మేమక్కడ చాలా బిజీగా ఉన్నామని చెప్పి తప్పు కుంటున్నారు.    చివరకు మెంబర్ షిప్ లాంచింగ్ ను పట్టించుకోలేదు.

 

నిజానికి అదివారం నాటి సభలో రాజకీయాలు మాట్లాడింది పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ,  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లే. కెసిఆర్, కెటిఆర్   మంత్ర ముగ్ధులై ఉన్న తెలంగాణా టిడిపిని కాపాడేశక్తి వీళ్లకు ఉందా?  మీకు  పార్టీ అప్పగిస్తున్నా, పార్టీని పటిష్టం చేసుకోవండని పార్టీని వాళ్లకొదిలేయడమంటే అర్థమేమిటి? పార్టీ ఎమ్మెల్యేలు మిగలకుండా పోయిందందుకేనేమో. ఈ  సారి మీటింగ్ కు మిగిలి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఆర్ కృష్ణయ్య రానేలేదు.

 

 

ఆంధ్రముఖ్యమంత్రి హైదరాబాద్ లో  చేసిన రాజకీయ ఉపవాస విశేషాలివి :

 

“మీ అభిమానం , ఉత్సాహం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అయితే,  పార్టీపై, తనపై విశ్వాసంతో ఏపీలో అధికారం ఇచ్చినందున ఇక్కడ ఉండిపోవడం సాధ్యం కావడం లేదు.”

“ తెలంగాణలో పార్టీకోసం ఎక్కువ సమయాన్ని కేటారుయిస్తాను. పార్టీకి బలమైనా, బలహీనత అయినా నాయకత్వమే. పార్టీని పటిష్టపర్చండి సమన్వయం తో ముందుకు పోవాలి.”

“గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయిండి. మన వాళ్లు పోరాటం చేస్తూ ముందుకు పోతున్నారు. నాకు రియల్ టైం లో ఇవన్నీ తెలుస్తున్నాయి.”

 

అక్కడ రాజకీయాలు మాట్లాడింది రేవంత్, రమణలే...

 

‘కొత్త రాష్ట్రాన్ని కోతులకు ఇచ్చినట్టుగా ఉంది. తొమ్మిదెకరాల్లో సీఎం కేసీఆర్ 150 గదులతో గడిని నిర్మించుకున్నారు –రేవంత్ రెడ్డి.

 

 ప్రాణహిత-చేవెళ్ల ప్రాజక్టు ను పక్కన పెట్టి కెసిఆర్ స్వలాభాపేక్షతో ప్రాజక్టులను రిడిజైన్ చేస్తున్నారు-ఎల్.రమణ

 

నెలరోజులకు ఒక్కసారైనా తెలంగాణలో పార్టీ అభివృద్ధికి చంద్రబాబు సమయం ఇవ్వాలి-మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.

 

వోటుకు నోటు దెబ్బ ఇంక సలుపుతూనే ఉందా?

నిప్పు లాంటి నాయకుడు  ఇంత భయపడితే పార్టీ బతికి బట్టకడుతుందా?