మహిళా హెడ్ మాస్టర్ పై స్కూళ్లోనే హత్యాయత్నం

murder attempt on woman headmaster at mahaboob nagar district
Highlights

గొంతు కోసుకుని హెడ్ మాస్టర్ భర్త కూడా ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో  హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. కట్టుకున్న భర్తే పాఠశాలలోకి ప్రవేశించి ఈమెపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన సహచర ఉపాద్యాయులు, విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం ముసులేపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో కన్యాకుమారి అనే మహిళ హెడ్ మాస్టర్ గా పనిచేస్తోంది. ఈమెకు రమణారెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే కొద్దిరోజులు అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో ఈ మద్య వివాదాలు చెలరేగాయి. భార్య భర్తల మద్య గొడవలు మొదలయ్యాయి. దీంతో రమణా రెడ్డి తన భార్య పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం పాఠశాలలో విధులకు హాజరైన  కన్యాకుమారిపై కత్తితో దాడి చేశాడు. స్కూళ్లో విద్యార్థులు, సహచర ఉపాద్యాయులు చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో హెడ్‌మాస్టర్ కన్యాకుమారి రక్తపుమడుగులో పడిపోయింది. ఈ దాడి అనంతరం భర్త రమణా రెడ్డి కూడా అదే కత్తితో గొంతుగోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 

దీంతో అక్కడే వున్న సహచర ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

loader