తాడేపల్లి గూడెంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య వివాదం ముదురి పాకానపడింది. స్థాయిని మరిచి ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుపై తాడేపల్లి గూడెం మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్  చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారి తీసాయి. ఈ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ కూడా అయ్యారు. ఈ ఘటనలో తప్పు ఎవరిదో తేల్చడానికి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కమిటీ కూడా నియమించారు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల  జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌ మంత్రి మాణిక్యాలరావుపై విమర్శలు చేశారు. ఆయనను ఉద్దేశించి ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్‌ అని పేర్కొనడం దుమారం రేపింది.  బొలిశెట్టి వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్యాలరావు.. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని అన్నారు. తాను ఫోటో గ్రాఫర్ గా చెప్పుకోవడానికి సిగ్గుపడనని పేర్కొన్నారు.

 ఈ ఘటన కారణంగా జిల్లాలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య తీవ్ర వివాదానికి దారితీయడంతో విషయం చంద్రబాబు దాకా వెళ్లింది. చంద్రబాబు సీరియస్ కావడంతో.. బొలిశెట్టి కూడా కాస్త వెనక్కి తగ్గారు. దీనిపై బొలిశెట్టి తాజాగా వివరణ ఇచ్చారు. తాను మంత్రిపై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఆఫ్టర్ ఫోటోగ్రాఫర్ మంత్రి అన్నానని.. ఆఫ్ట్రాల్ ఫోటోగ్రాఫర్ అనలేదని చెప్పుకొచ్చారు.