సినిమా హీరోలను వేలల్లో, లక్షల్లో అభిమానులు ఉండటం సర్వసాధారణం. అభిమాన హీరో సినిమా విడుదలైతే చాలు... ఫస్ట్ షో చూసేందుకు వేలు ఖర్చు పెట్టే అభిమానులు ఉన్నారు. తమ హీరో ఫోటోలను పాలభిషేకం చేసే అభిమానులు కూడా ఉన్నారు. కానీ.. ఆ అభిమానికి ఆస్తి రాసిచ్చేవారు ఉన్నారా..? కానీ ఓ మహిళ అదే చేసింది. చనిపోయేముందు ఆస్తి తన కుటుంబ సభ్యులకు కాకుండా తన అభిమాన హీరో పేరిట రాసి చనిపోయింది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన నిషి త్రిపాఠి అనే మహిళకు సంజయ్‌ దత్‌ అంటే ఎంతో అభిమానం. జనవరి 29న అనారోగ్యంతో ఆమె కన్నుమూసింది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందే తన ఆస్తంతా సంజయ్‌ దత్‌ పేరిట రాసేసింది. ఆమె మరణానంతరం.. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ వాళ్లు సంజయ్ దత్ కి ఫోన్ చేశారు. నిషి త్రిపాఠి పేరుమీద ఉన్న ఆస్తులన్నీ మీ పేరు మీద ట్రాన్స్ ఫర్ అయ్యాయి అని బ్యాంక్ వాళ్లు సంజయ్ దత్ కి చెప్పారు. దీంతో.. ఒక్కసారిగా ఆయన షాక్ అయ్యారు.

నిషి.. ఇలా ఆస్తినంతటినీ సంజయ్ పేరుమీద రాసిన విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవడం విశేషం. బ్యాంకు వాళ్లు వచ్చి చెప్పిన తర్వాతే.. వాళ్లు  ఈ విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. అయితే.. ఈ విషయంపై సంజయ్ దత్ స్పందించారు. అసలు ఆ నిషి ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఆమె ఆస్తులన్నీ చట్ట ప్రకారం.. ఆమె కుటుంబసభ్యులకే దక్కాలని అన్నారు. అభిమానంతో చాలా మంది గిఫ్ట్ లు ఇచ్చారు కానీ.. ఇలా ఆస్తి రాసివ్వడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. నిషి ఆస్తులు ఆమె కుటుంబసభ్యులకు చెందేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.