పట్టువదలని పద్మనాభం, ఆగస్ట్‌ 3 నుంచి మళ్లీ పాదయాత్ర

First Published 27, Jul 2017, 4:31 PM IST
mudragada to revive padayatra from August 3
Highlights
  • వారం రోజులు గృహ నిర్బంధం అయిపోగానే మళ్లీ పాదయాత్రకు సమాయత్తమంటున్న ముద్రగడ పద్మనాభం
  • జిల్లా మొత్తం  పోలీసుల పహారా కొనసాగుతుంది
  • నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి

ఆగస్ట్‌ 3వ తేదీ నుంచి మళ్లీ పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసుల కాపలాలో గృహ నిర్బంధంలో ఉన్న పద్మనాభం  గడువు తీరగానే మళ్లీ యాత్ర ఏర్పాట్లలో మునిగిపోతారన్నమాట. జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు ఆయన మీద ఏడు రోజులు పాటు పోలీసులు గృహ నిర్బంధం విధించారు. ఆగస్టు రెండు వరకు నిర్బంధం ఉంటుంది.

ఈ రోజు కిర్లంపూడిలో ఆయన  విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆభయంతోనే ఆయన 30 స్టేలు తెచ్చుకున్నారు. నాది ఆయన లాంటి జీవితం కాదు. నేను సాగించే పోరాటం  మా జాతి ప్రయోజనాల కోసం. ముఖ్యమంత్రి కాపు జాతికి ఇచ్చిన హామీని నెరవేర్చేవరకూ ఉద్యమం కొనసాగుతుంది.  చంద్రబాబు ఎవరి అనుమతి తీసుకొని పాదయాత్ర చేశారు? పోలీసులకు ఆయనిచ్చిన అనుమతి నమునా నాకిస్తే నేను దరఖాస్తు చేస్తా. లేదంటే నా పాదయాత్రను అనుమతించండి,’ అని అన్నారు.

పోలీసుల నోటీసులపై కోర్టుకు వెళ్లేది, అరెస్టు చేయాలనుకుంటే స్టే తెచ్చుకోవడం, అరెస్టయితే బెయిల్‌ తెచ్చుకోవడం నాకు అలవాటు లేదని ఆయన చాలా స్పషంగా చెప్పారు.

అటువైపు పోలీసులు జిల్లా మొత్తం నిర్బంధాన్ని కొనసాగించాలనే నిర్ణయించారు.ఆగస్ట్‌ 2వరకూ ముద్రగడ హౌస్‌ అరెస్ట్‌ నేపథ్యంలోనే ఉంటారని అప్పటివరకూ జిల్లాలో ఆంక్షలు కొనసాగుతాయని తూర్పు గోదావరి ఎస్ పి ఎస్పీ విశాల్‌ గున్నీ చెప్పారు.  ఈ మధ్యన ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని ఎస్పీ చెప్పారు.

loader