విమానాల్లో ప్రయాణించడానికి అయిన ఖర్చు రూ.131కోట్లు. ఒక ఎంపీ.. ఒక సంవత్సరంలో 34సార్లు.. ఉచితంగా విమానంలో ప్రయాణించవచ్చు
ముఖ్యమంత్రులు.. మంత్రులు, ఎంపీలు.. లాంటివారందూ.. సాధారణంగా విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఎందుకంటే.. త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. వారి విలువైన సమయాన్ని కూడా ఆదా చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే... వారు విమానాల్లో ప్రయాణించడానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా.. అక్షరాలా రూ.131కోట్లు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.
కేవలం ఒక సంవత్సరంలోనే ఎంపీలందరూ విమానాల్లో ప్రయాణించడానికి అయిన ఖర్చు రూ.131కోట్లు. కేవలం పశ్చిమ బెంగాల్ కి చెందిన ఎంపీ రిటబ్రట బెనర్జీ.. ఏడాదికి విమానాల్లో ప్రయాణించడానికి రూ.69లక్షలు ఖర్చుచేసారు.
ఆర్టీఐ( రైట్ టూ ఇన్ఫర్మేషన్) యాక్టివిస్ట్ దినేష్ చందా.. అనే న్యాయవాది ఎంపీలు విమాన ప్రయాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకునేందుకు పిటిషన్ వేశారు. లోక్ సభ, రాజ్యసభ రెండింటికి చెందిన ఎంపీల ఖర్చుల వివరాలు కావాల్సిందిగా ఆయన కోరారు.
పార్లమెంట్ వెబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఎంపీ.. ఒక సంవత్సరంలో 34సార్లు.. ఉచితంగా విమానంలో ప్రయాణించవచ్చు. వారు ఒంటరిగా అయినా లేదా తమ జీవితభాగస్వామి ఇంకెవరైనా ఒకరితో కలిసి ప్రయాణించవచ్చు. అంతేకాదు.. ఎంపీ భాగస్వామలు కూడా ఒక సంవత్సరంలో 8సార్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణ అవకాశం అయిపోతే.. టిక్కెట్ ధరపై నాల్గవ వంతు చెల్లించి కూడా ప్రయాణించే అవకాశం ఉంది. అంటే.. ఒకవేళ టికెట్ రూ.1లక్ష అయితే..వారు రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే.. ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017మధ్య కాలంలో లోక్ సభ ఎంపీలు విమాన ప్రయాణానికి రూ.95,70,01,830 ఖర్చు చేయగా.. రాజ్యసభ సభ్యులు రూ.35,89,31,862 ఖర్చు చేశారు.
తమిళనాడులోని ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ఎంపీ కే గోపాల్.. రూ.57లక్షలు, అదే పార్టీకి చెందిన మరో ఎంపీ పి కుమార్ రూ.44,29,901 ఖర్చు చేశారు.
అండమాన్ నికోబార్ లోని భాజపా కు చెందిన బిష్ను పడారే రూ.41లక్షలకు పైగా ఖర్చు చేయగా, కేరళలోని సీపీఎం పార్టీకి చెందిన ఎంపీ సంపత్ రూ.38లక్షలకు పైగా ఖర్చు చేశారు. కేరళలోని అదే పార్టీకి చెందిన మరో ఎంపీ శ్రీమతి రూ.32లక్షలకు పైగా ఖర్చు చేశారు.
కేరళలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కేసీ వేణుగోపాల్ రూ.32లక్షలకుపైగా ఖర్చు చేయగా.. బిహార్ లోని భాజపా ఎంపీ హరి మాంఝీ రూ.31లక్షలకు పైగా ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్ కి చెందిన భాజపా ఎంపీ జ్యోతి ధ్రువే రూ.31లక్షలు, కేరళలోని కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ రూ.31లక్షలు, కేరళలోని సీపీఎం పార్టీ ఎంపీ ఎంబీ రాజేష్ రూ.30లక్షలు ఖర్చు చేశారు.
ఎంపీలకు విమాన ప్రయాణంలో చాలా వెసులుబాటు కల్పించినా.. ఈవిధంగా ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది.
