టీం ఇండియా క్రికెటర్ షమీకి ఆయన భార్య హసీన్ జహాన్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే .. షమీకి పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనను హింసిస్తున్నాడని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా షమీకి పై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నం సెక్షన్ల కింద షమీ పై కేసు నమోదు చేశారు.

తాజాగా.. ఈ కేసు విషయంలో హసీన్.. షమీకి మరో పెద్ద షాక్ ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐకి పంపించింది. ‘గురువారం కోల్‌కతా పోలీస్‌ స్టేషన్లో షమిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కాపీని సీఓఏ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌కి పంపించాం’ అని  హసీన్ తరపు న్యాయవాది జకీర్‌ చెప్పారు. ఒక మ్యాచ్‌ను ఫిక్స్‌ చేసేందుకు పాకిస్థాన్‌ అమ్మాయి ద్వారా షమి డబ్బు తీసుకున్నట్లు హసీన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన సీఓఏ దీనిపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఛైర్మన్‌ నీరజ్‌ కుమార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జకీర్‌ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కాపీని పంపినట్లు తెలుస్తోంది